మన టీకా కోసం ప్రపంచం నిరీక్షణ

10 Jan, 2021 04:55 IST|Sakshi

ప్రవాసీ భారతీయ దివస్‌లో మోదీ

ఔషధ రంగంలో భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ఇనుమడిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కోవిడ్‌–19 మహమ్మారిని కట్టడి చేయడానికి మన దేశం ఇప్పటికే రెండు టీకాలను అభివృద్ధి చేసిందని, వాటి కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని అన్నారు. అలాగే అతిపెద్దదైన కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఇండియా ఎలా అమలు చేయనుందనే దానిపై ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి పెరుగుతోందని తెలిపారు. ప్రధాని శనివారం 16వ ప్రవాసీ భారతీయ దివస్‌ (పీబీడీ) ప్రారంభోత్సవంలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఎక్కడైనా గొప్పగా వెలిగిపోతోంది అంటే అది భారత్‌లో మాత్రమేనని వ్యాఖ్యానించారు.

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో దేశంలో ప్రజాస్వామ్యం మనుగడపై ఎంతోమంది ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారని, అవన్నీ పటాపంచలు అయ్యాయని ఉద్ఘాటించారు. మన దేశంలో తయారైన వస్తువులను మరిన్ని ఉపయోగించాలని ప్రవాస భారతీయులకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీంతో మన చుట్టుపక్కల నివసించే వారిలోనూ ఆయా వస్తువులు వాడాలన్న ఆకాంక్ష పెరుగుతుందని చెప్పారు. స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్‌ వేగంగా అడుగులేస్తోందని, ‘బ్రాండ్‌ ఇండియా’ ఉద్దీపనలో ప్రవాస భారతీయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రపంచానికి మన దేశం ఒక ఔషధాగారంగా మారిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలకు అవసరమైన ముఖ్యమైన ఔషధాలను భారత్‌ సరఫరా చేస్తోందని చెప్పారు.

కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో 16న భారత్‌ కీలకమైన ముందడుగు వేయబోతోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌. వ్యాక్సిన్‌ పంపిణీలో వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, సఫాయి కర్మచారీలు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ప్రాధాన్యం లభిస్తుంది.  
– ట్విట్టర్‌లో మోదీ

మరిన్ని వార్తలు