81లక్షలు దాటిన కేసులు

1 Nov, 2020 05:46 IST|Sakshi

మరో 551 మరణాలు

74 లక్షలు దాటిన రికవరీలు

న్యూఢిల్లీ: గత 24 గంటల్లో 48,648 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,37,119కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 551 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,21,641కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 74,32,829కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,82,649గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 7.16 శాతం ఉన్నాయి.

కరోనా రోగుల రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 91.34 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల శాతం 1.49గా ఉంది. గత 24 గంటల్లో సంభవించిన కరోనా మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 127  మంది మరణించారు. ఈ నెల 30 వరకూ 10,87,96,064 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. శుక్రవారం మరో 10,67,976 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కాగా, దేశంలో ప్రతి మిలియన్‌ మందికి 88 మరణాలు సంభవిస్తున్నాయని చెప్పింది. 65 శాతం మరణాలు కేవలం ఐదు రాష్ట్రాల నుంచే నమోదు అవుతున్నాయని తెలిపింది.

కుటుంబీకులకు ప్రమాదం
కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే, అది కుటుంబంలోని ఇతరులకు సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని అమెరికా చేసిన ఓ తాజా అధ్యయనంలో తేలింది. ‘కుటుంబంలో ఒక్కరికి కరోనా వస్తే, ఇతరులు వేగంగా దాని బారిన పడుతున్నట్లు గుర్తించాము. వ్యాప్తి మాత్రం వేగంగా ఉంటోంది’ అని అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్‌ కార్లోస్‌ జీ గ్రిజావ్లా చెప్పారు. కేవలం 5 రోజుల్లోనే ఇంట్లో ఉండే 75 శాతం మందికి సోకుతోందని తేలింది. కరోనా అని అనుమానం రాగానే టెస్టుకు వెళ్లడానికి ముందే ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. ప్రత్యేక గది, ప్రత్యేక బాత్రూమ్‌ ఉపయోగించాలని చెప్పారు.  

మరిన్ని వార్తలు