7 కోట్లు దాటిన కరోనా కేసులు

12 Dec, 2020 05:24 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసు ల సంఖ్య 7 కోట్లు దాటింది. ఇందులో కేవలం గత రెండు నెలల్లోనే రెండు కోట్ల కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా మన దేశంలో గత  24 గంటల్లో 29,398 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,96,769కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇటీవల నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య పడిపోతూ వస్తున్న క్రమంలో 30వేల కిందకు చేరడం గమనార్హం. అలాగే కరోనా కారణంగా గురువారం 414 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,42,186కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య గురువారానికి 92,90,834కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 94.84 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,63,749గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 3.71  శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.45గా ఉంది.

మేఘాలయ సీఎంకు కరోనా..
మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్‌ కె సంగ్మా తనకు కరోనా సోకిందని శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం కొద్దిమేర లక్షణాలు ఉన్నాయని, ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు