మేలో దేశాన్ని వణికించిన కరోనా

2 Jun, 2021 03:30 IST|Sakshi

నెలలో 90.10 లక్షల కేసులు 

1.20 లక్షల మంది కోవిడ్‌తో మృతి

సాక్షి, న్యూఢిల్లీ: సెకండ్‌ వేవ్‌లో ఏప్రిల్‌నాటి కోవిడ్‌ సంక్షోభ రికార్డులను తిరగరాస్తూ కరోనా మే నెలలో ప్రపంచ రికార్డులను నమోదు చేసింది. నెల ప్రారంభంలో విజృంభించిన కరోనా నెలాఖరుకల్లా తగ్గుముఖం పట్టింది. కేవలం మే నెలలో దేశంలో 90,10,075 పాజిటివ్‌ కేసులు, 1,20,042 కోవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసుల సంఖ్య, కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య తగ్గనప్పటికీ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువకు దిగిరావడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. మార్చి 1వ తేదీన దేశంలో 12,286 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి కరోనా విస్తృతి విపరీతంగా పెరిగి ఏప్రిల్‌ 6వ తేదీన 1.15 లక్షల కొత్త కేసులొచ్చాయి. తర్వాత కరోనా సంక్రమణ వేగం ఒక్కసారిగా ఊపందుకోవడంతో మేలో రోజువారీ కొత్త కేసులు 4 లక్షల మార్క్‌ను దాటేశాయి. మార్చి 1తో పోలిస్తే 67 రోజుల తర్వాత మే 6 న ఈ సంఖ్య 34 రెట్లు పెరిగి 4.14 లక్షలు దాటింది.  


గత 24 రోజుల్లో 63% తగ్గిన పాజిటివ్‌ కేసులు
మే 6 తర్వాత దేశంలో రోజువారీ కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. గత 24 రోజుల్లో రోజు వారీ పాజిటివ్‌ కేసులు 63% తగ్గి నెలాఖరున 1,27,510 కేసులు నమోదయ్యాయి. 


26 రెట్లు పెరిగిన కరోనా మరణాలు
దేశంలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మరణాల సంఖ్య భయపెడుతోంది. మార్చి 1న దేశంలో 92 మరణాలు సంభవించగా, మే 18వ తేదీన దేశంలో అత్యధికంగా 4,529 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా దేశంలో సగటున రోజువారీ మరణాల సంఖ్య 3523గా నమోదవుతోంది. మార్చి నెలలో 5,766, ఏప్రిల్‌ నెలలో 48,926, మే నెలలో 1,20,042 కరోనా మరణాలు సంభవించాయి. 


గత 54 రోజుల్లోనే అతి తక్కువ కేసులు..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 1,27,510 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువ కేసులు రావడం గత 54 రోజుల్లో ఇదే తొలిసారి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,81,75,044కు పెరిగింది. గత 24 గంటల్లో 2,795 మంది కోవిడ్‌తో మరణించారు. మొత్తం కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య 3,31,895కు పెరిగింది. ఇంత తక్కువ మరణాలు నమోదవడం గత 35 రోజుల్లో ఇదే తొలిసారి. దేశంలో గత 24 గంటల్లో 2,55,287 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,59,47,629కు పెరిగింది. రికవరీ రేటు 92.09 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 18,95,520కు చేరుకుంది. 43 రోజుల తర్వాత దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 20 లక్షల దిగువన నమోదైంది. కరోనా పాజిటివిటీ రేటు 6.62%గా నమోదైంది. మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు