14 లక్షలు దాటేశాయ్‌..!

28 Jul, 2020 04:50 IST|Sakshi
చెన్నైలో స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన గొడుగులతో సామాజిక దూరం పాటిస్తున్న జనం

24 గంటల్లో 708 మంది కన్నుమూత

న్యూఢిల్లీ: భారత్‌లో వరుసగా ఐదో రోజు 45 వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. 24 గంటల్లో 49,931 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. అలాగే 708 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దేశంలో మొత్తం కేసులు 14,35,453కు, మరణాలు 32,771కు చేరాయని కేంద్రం సోమవారం ప్రకటించింది. 9,17,567 మంది బాధితులు చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కరోనా కేసులు 4,85,114. రికవరీ రేటు 63.92 శాతానికి చేరింది.  కాగా, కరోనా వైరస్‌ నివారణకు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, అస్ట్రాజెనెకా సంస్థ కలిసి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ను భారత్‌లో త్వరలో 5 చోట్ల వేలాది మందిపై ప్రయోగించనుంది.

భారత్‌కు ఇజ్రాయెల్‌ బృందం రాక
కేవలం 30 సెకండ్లలో ఫలితాన్ని వెల్లడించే ర్యాపిడ్‌ కరోనా టెస్టింగ్‌ కిట్‌ అభివృద్ధికి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇందుకోసం ఇజ్రాయెల్‌ రక్షణ శాఖకు చెందిన ఆర్‌అండ్‌డీ శాస్త్రవేత్తల బృందం ప్రత్యేక విమానంలో సోమవారం భారత్‌కు చేరుకుంది. అత్యాధునిక వైద్య పరికరాలను  వెంట తీసుకొచ్చింది. నిజానికి ఈ పరికరాలను ఇజ్రాయెల్‌ నుంచి ఎగుమతి చేయడంపై నిషేధం ఉంది. అయినప్పటికీ ప్రత్యేక అనుమతితో భారత్‌కు తరలిం చారు. టెస్టింగ్‌ కిట్‌ అభివృద్ధి విషయంలో ఈ బృందం భారత్‌ చీఫ్‌ సైంటిస్టు కె.విజయ్‌ రాఘవన్, డీఆర్‌డీవోతో కలిసి పనిచేయనుంది. ఈ టెస్టింగ్‌ కిట్‌ అందుబాటులో వస్తే అది కరోనాపై పోరులో కీలక మలుపు అవుతుందని ఇజ్రాయెల్‌ రాయబారి రోన్‌ మాల్కా పేర్కొన్నారు. కరోనాపై కలిసి పోరాడుదామని భారత్, ఇజ్రాయెల్‌  నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
 

>
మరిన్ని వార్తలు