కేసుల కంటే రికవరీలే ఎక్కువ

21 Sep, 2020 06:42 IST|Sakshi

న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం వరకు దేశంలో కొత్త కేసులు భారీ స్థాయిలో వెలుగు చూడగా, గత రెండు రోజుల నుంచి రికవరీలు భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 94,612 మంది కరోనా నుంచి కోలుకోగా, 92,605 కేసులు బయటపడ్డాయి. నమోదైన కేసుల కంటే డిశ్చార్జి అయిన కేసులు ఎక్కువ కావడం విశేషం. వీటితో పాటు 24 గంటల్లో భారీ స్థాయిలో 12 లక్షలకు పైగా పరీక్షలు జరిగాయి. ఆదివారం వెలుగు చూసిన వాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 54,00,619కు చేరుకుంది.

గత 24 గంటల్లో 1,133 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 86,752కు చేరుకుందని  కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 43,03,043కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 10,10,824గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 18.72 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 79.68 శాతానికి పెరగ్గా, మరణాల రేటు 1.61 శాతానికి పడిపోయిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇలా ఉండగా, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో కరోనా రెండోసారి సోకుతోందంటూ అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఆయా కేసుల వివరాలను సేకరించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది.

మరిన్ని వార్తలు