16.98%కి పాజిటివిటీ రేటు

17 May, 2021 06:29 IST|Sakshi

మే 3న ఇది 24.47%

యాక్టివ్‌ కేసులు 14.66 శాతమే

24 గంటల్లో 3,11,170 కరోనా కేసులు నమోదు

25 రోజుల్లో ఇదే కనిష్టం

నాలుగు వేలు దాటిన మరణాలు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా గణాంకాలు ఊరటనిస్తున్నాయి. ఇంకా రోజుకు మూడు లక్షలకు పైనే కేసులు వస్తున్నప్పటికీ... మొత్తం మీద చూస్తే తగ్గుదల కనిపిస్తోంది. శనివారం కొత్తగా 3,11,170 కేసులు వచ్చాయి. అయితే గడిచిన 25 రోజుల్లో ఇవే అత్యల్పం కావడం గమనార్హం. అలాగే మే 3వ తేదీన ఏకంగా 24.47 శాతం ఉన్న  పాజిటివిటీ రేటు ప్రస్తుతం 16.98 శాతానికి పడిపోయింది. అలాగే యాక్టివ్‌ కేసులు తగ్గడం కూడా ఉపశమనం కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 55,344 యాక్టివ్‌ కేసులు తగ్గాయి.

3.62 లక్షల మంది కోలుకున్నారు. గడిచిన ఆరురోజుల్లో కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా నమోదవడం ఇది ఐదోసారి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 14.66 శాతం ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. దేశంలో వరుసగా మూడో రోజూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే, మరాణాలు మాత్రం నాలుగు వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 3,11,170 కొత్త కేసులు నమోదు కాగా,  4,077 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారు 2,07,95,335 ఉండగా... గడిచిన 24 గంటల్లో 3,62,437 మంది కోలుకున్నట్లు పేర్కొంది. కోలుకున్న వారిలో అధికశాతం ఆంధ్రప్రదేశ్‌ సహా పది రాష్ట్రాల్లో (71 శాతం) ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ ఆదివారానికి 36,18,458 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వీటిలో 74.69 శాతం కేసులు ఏపీ సహా పది రాష్ట్రాల్లో ఉన్నట్లు పేర్కొంది. పాజిటివిటీ రేటు 16.98 శాతానికి తగ్గిందని తెలిపింది. దేశంలో మరణాల రేటు 1.09 శాతంగా ఉంది. మూడో దశ టీకాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకూ ఇచ్చిన డోసులు 18.22 కోట్లు దాటాయని తెలిపింది.

దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకాల్లో 66.76 శాతం వాటా ఆంధ్రప్రదేశ్‌ సహా పది రాష్ట్రాలు ఉన్నట్లు పేర్కొంది. 18 నుంచి 44 వయసు వారు 5,62,130 మందికి గడిచిన 24 గంటల్లో టీకా అందించామని తెలిపింది. దీంట్లో ఏపీలో 3443 మంది, తెలంగాణలో 500 మందని ఉన్నారని వివరించింది. టీకాలు ప్రారంభించిన 120 రోజున.. మే15న 17,33,232 డోసులు పంపిణీ జరిగిందని దీంట్లో 11,30,928 మందికి తొలి డోసు, 6,02,304 మందికి రెండో డోసు అందించినట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో కర్ణాటక (41,664), మహారాష్ట్ర (34,848), తమిళనాడు (33,658)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మరణాల్లో  అత్యధికంగా మహారాష్ట్రలో 960 మంది, కర్ణాటకలో 349 మంది ఉన్నట్లు తెలిపింది. 

మరిన్ని వార్తలు