దేశంపై మళ్లీ కరోనా పడగ

22 Nov, 2020 04:37 IST|Sakshi
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కర్ఫ్యూతో బోసిపోయిన ప్రధాన రహదారి

ఉత్తర, మధ్య భారతంలో విజృంభణ

మధ్యప్రదేశ్, గుజరాత్‌లో కొన్ని చోట్ల రాత్రి కర్ఫ్యూ 

రాజస్తాన్‌లో నిషేధాజ్ఞలు

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ యూపీలో నిబంధనలు

న్యూఢిల్లీ: చలికాలం వణికిస్తున్న కొద్దీ కరోనా కూడా విజృంభిస్తోంది. ప్రధానంగా ఉత్తర, మధ్య భారతంలోని పలు రాష్ట్రాల్లో పడగ విప్పింది. రోజు రోజుకీ కేసులు ఎక్కువ అయిపోతూ ఉండడంతో నిబంధనల చట్రంలోకి ఒక్కో రాష్ట్రం వెళ్లిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్, హరియాణా వంటి రాష్ట్రాల్లో కోవిడ్‌ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఈ రాష్ట్రాల్లో సెకండ్‌ వేవ్‌ మొదలైందన్న ఆందోళన నెలకొంది.

హరియాణాలో మొదటిసారిగా రోజుకి 3 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ నెలాఖరువరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో అయిదు జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ శుక్రవారం ప్రకటించారు. భోపాల్, ఇండోర్, గ్వాలియర్, రాట్లామ్, విదిశ జిల్లాల్లో కోవిడ్‌–19 రేటు 5% కంటే ఎక్కువ పెరిగిపోయింది. దీంతో కర్ఫ్యూ విధించక తప్పడం లేదని సీఎం చెప్పారు.  

గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, వడోదరా, రాజ్‌కోట్‌లో నిరవధికంగా రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. రాజస్తాన్‌లో రోజుకి సగటున 3 వేల కేసులు నమోదవడంతో 33 జిల్లాల్లో 144 సెక్షన్‌ విధించారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్లు కదిలి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మహారాష్ట్రలో 9,10 తరగతులకు తిరిగి పాఠశాలలను తీయాలని భావించినప్పటికీ, మళ్లీ కేసులు పెరిగిపోతూ ఉండడంతో ఈ ఏడాది చివరి వరకు పాఠశాలలను మూసివేస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  

ఢిల్లీలో ఒకే రోజు 7,500 కేసులు
దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల్లో 7,500 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో కరోనా కట్టడికి కేజ్రీవాల్‌ సర్కార్‌ పలు చర్యలు తీసుకున్నప్పటికీ కేంద్రం కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. డిసెంబర్‌లో కేసులు మరింతగా పెరిగిపోతాయని అంచనాలున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచిన కేంద్రం నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తోంది.  

దీపావళి తర్వాత పెరిగిపోతున్న కేసులు  
ఆరు నెలల కాలంలో భారత్‌లో రోజు వారీ కేసులు అత్యధిక స్థాయికి చేరుకొని మళ్లీ తగ్గినట్టే తగ్గి పెరిగిపోతున్నాయి. సెప్టెంబర్‌ 10న ఇంచుమించుగా లక్ష వరకు రోజువారీ కేసులు (99,181 కేసులు నమోదు) చేరుకున్నాయి. అక్టోబర్‌ చివరి వారం నుంచి తగ్గు ముఖం పట్టిన కేసులు, మళ్లీ ఇప్పుడు పెరిగిపోతూ ఉండడంతో సెకండ్‌ వేవ్‌ మొదలైందనే భావించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

13 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ మహమ్మారి కరోనాకు వ్యతిరేక పోరాటంలో భారత్‌ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటి వరకూ 13,06,57,808 పరీక్షలు చేశారు. వీటిలో చివరి కోటి పరీక్షలను 10 రోజుల వ్యవధిలో నిర్వహించడం గమనార్హం. యూరప్, అమెరికన్‌ దేశాల్లో రోజువారీ కేసులు పెరుగుతున్న సమయంలో, మనదేశంలో కరోనా కట్టడికి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించాయి. అయితే 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ సగటు కంటే తక్కువ పరీక్షలను నిర్వహించాయి. ఈ రాష్ట్రాల్లో పరీక్ష స్థాయిలను పెంచాలని కేంద్రం సూచించింది.

33 మంది అధికారులకు కరోనా
ముస్సోరిలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పొందుతున్న 428 మంది ఆఫీసర్‌ ట్రైనీలలో 33 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అకాడమీలోని పలు డిపార్ట్‌మెంట్‌లను ముందు జాగ్రత్తగా మూసివేసిట్లు అధికారులు పేర్కొన్నారు. నవంబర్‌ 30 వరకూ క్లాసులను ఆన్‌లైన్‌ ద్వారా బోధించనున్నట్లు తెలిపారు.

కొత్త కేసులు.. 46 వేలు
దేశంలో గత 24 గంటల్లో 46,232 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90.50 లక్షలకు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 564 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,32,726కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శనివారానికి 84.78 లక్షలకు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 93.67 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,39,747గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 4.86  శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.46గా ఉంది. ఈ నెల 20 వరకూ 13.06 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. శుక్రవారం 10,66,022 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది.   
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు