India: 2 ఏళ్ల ఆయుష్షు తగ్గింది.. ఎందుకో తెలుసా!

28 Oct, 2021 13:14 IST|Sakshi

కోవిడ్‌తో మారిన భారతీయుడి సగటు ఆయుర్దాయం

పురుషుడి ఆయుర్దాయం 67.5 ఏళ్లకు, మహిళ జీవితకాలం 69.8 ఏళ్లకు తగ్గుదల

ఐఐపీఎస్‌ తాజా అధ్యయనం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మానవ జీవితాలపై పెను ప్రభావం చూపించింది. భారీ సంఖ్యలో మరణాలతో పాటు అనేక శారీరక, మానసిక రుగ్మతలకు కారణమయ్యింది. అంతేకాదు మానవుని సగటు జీవిత కాలాన్ని సైతం ఏకంగా రెండేళ్లు తగ్గించేసిందని తేలింది. దేశంలో దశాబ్ద కాలం కిందట ఉన్న సగటు ఆయుష్షు కాలానికి ఇది క్షీణించింది. కోవిడ్‌–19కు ముందు మరణాల తీరును, ఆ తర్వాత జరిగిన మరణాలపై ముంబైలోని అంతర్జాతీయ జనాభా అధ్యయన సంస్థ (ఐఐపీఎస్‌) ఆధ్యయనం చేసింది.

కోవిడ్‌–19కు ముందు పురుషుడు సగటున 69.5 సంవత్సరాలు, మహిళ సగటున 72 సంవత్సరాల పాటు జీవిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే కోవిడ్‌–19 తీవ్రత తర్వాత పురుషుడి సగటు జీవితకాలం 67.5 ఏళ్లకు, మహిళ సగటు జీవితకాలం 69.8 ఏళ్లకు తగ్గినట్లు ఐఐపీఎస్‌ పరిశీలన వివరిస్తోంది. 
చదవండి: ముందుంది ముప్పు.. చేయద్దు తప్పు.. గమనించగలరు

నడివయస్కులపైనే అధిక ప్రభావం.. 
కోవిడ్‌–19తో ఆరోగ్య సంక్షోభాలు అధికంగా నమోదైనట్లు వివిధ రకాల పరిశీలనలు చెబుతున్నాయి. కోవిడ్‌–19కు గురైన వారిపైనే కాకుండా ఇతరులపైనా దీని ప్రభావం పడింది. సాధారణ చిక్సితలకు కూడా సకాలంలో సేవలు లభించని పరిస్థితులు, మందుల కొరత, కార్పొరేట్‌ దోపిడీ లాంటి కారణాలు ఇతర వర్గాలపై ప్రభావాన్ని చూపగా.. కరోనా వైరస్‌ సోకిన బాధితులకు తక్షణ వైద్యం అందకపోవడం, విషమించిన తర్వాత చికిత్సకు వెళ్లడం లాంటి కారణాలతో ఆరోగ్య సమస్యలు పెరిగాయి. ప్రధానంగా నడివయస్కులపై ఇది ఎక్కువ ప్రభావం చూపింది. 35 నుంచి 69 ఏళ్ల మధ్య వయసు వారి ఆయువు రెండేళ్లు తగ్గినట్లు ఐఐపీఎస్‌ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
చదవండి: తెలంగాణలోనూ ఏవై.4.2 వేరియంట్‌

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌–19కు ముందు, ఆ తర్వాత మరణాల రేటును ఐఐపీఎస్‌ విశ్లేషించింది. కోవిడ్‌–19 మరణాలే కాకుండా సాధారణ మరణాలకు సంబంధించిన గణాంకాలను సైతం పరిశీలనకు తీసుకున్న ఐఐపీఎస్‌.. వయసుల వారీగా మరణాల రేటును అంచనా వేసింది. మొత్తంగా 2010కి ముందు ఉన్న సగటు జీవితకాలానికి ప్రస్తుత సగటు ఆయుష్షు పతనమైనట్లు పరిశీలన వివరిస్తోంది. మానవ మరణాలకు 21 రకాల వైరస్‌ సంక్రమణలు కారణంగా ఉండగా... తాజాగా కోవిడ్‌–19ను సైతం ఆ జాబితాలో చేర్చడంతో సంక్రమణల సంఖ్య 22కు పెరిగింది. 

మరిన్ని వార్తలు