Corona Virus: దేశంలో ఒమిక్రాన్‌ సబ్‌వేరియెంట్‌ కేసుల కలకలం

23 May, 2022 08:30 IST|Sakshi

ఢిల్లీ: భారత్‌లో ఒమిక్రాన్‌ సబ్‌వేరియెంట్‌ కేసుల కలకలం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని చెందిస్తున్న వేరియెంట్‌లుగా బీఏ.4, బీఏ.5లను పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ఉపవేరియెంట్‌ల కేసులు ఇప్పుడు మన దేశంలోనూ వెలుగు చూడడం ఆందోళనకు గురి చేస్తోంది. 

భారత్‌లో బీఏ.4, బీఏ.5 సబ్‌వేరియెంట్‌ కేసులు బయటపడినట్లు ఇన్సాకాగ్‌ (INSACOG) ప్రకటించింది. బీఏ.4 కేసులు తెలంగాణ, తమిళనాడులో వెలుగు చూడగా.. బీఏ.5 కేసు తెలంగాణలోనే బయటపడిందని తెలిపింది. 

ఒమిక్రాన్‌ వేరియెంట్‌లో ఉపవేరియెంట్లు బీఏ.4, బీఏ.5లు.. కరోనాలో ఇప్పటిదాకా అత్యంత వేగవంగా వైరస్‌ను వ్యాప్తి చెందించేవిగా పేరొందాయి. దక్షిణాఫ్రికా నుంచి దీని విజృంభణ మొదలైందని తెలిసిందే. అయితే ఒమిక్రాన్‌ ప్రధాన వేరియంట్‌ కంటే ఇవి ప్రమాదకారి కాదని, కాకపోతే వీటి ద్వారా సామాజిక వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే స్పష్టం చేసింది. 

ఇన్సాకాగ్‌ ఆదవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో.. తమిళనాడులో 19 ఏళ్ల యువతిలో బీఏ.4 ఉపవేరియెంట్‌ బయటపడిందని, అలాగే తెలంగాణలో (హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌) సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి శాంపిల్‌లోనూ ఈ ఉపవేరియెంట్‌ వెలుగు చూసింది. మరోవైపు తెలంగాణలోనే 80 ఏళ్ల వ్యక్తికి బీఏ.5 ఉపవేరియెంట్‌ కనుగొన్నట్లు ఇన్సాకాగ్‌ తెలిపింది. ఈ వృద్ధుడికి ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేదని, పైగా వ్యాక్సినేషన్‌ ఫుల్‌గా పూర్తికాగా, కేవలం స్వల్పకాలిక లక్షణాలే బయటపడినట్లు తెలిపింది. ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమైన అధికారులు.. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ మొదలుపెట్టారు.

భారత్‌లో ఇప్పటికే టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం వల్ల ఈ రెండు సబ్‌ వేరియంట్ల ప్రభావం స్వల్పంగానే ఉండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు సబ్‌ వేరియంట్ల వల్ల కొద్దిరోజుల్లో కేసులు పెరగవచ్చు, కానీ, ఉద్ధృతి తక్కువగానే ఉంటుందంటున్నారు. బాధితులకు తీవ్రస్థాయి అనారోగ్య ముప్పు, ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఉండవని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ.. మరిన్ని వేరియెంట్లు.. అందులో ప్రమాదకరమైనవి ఉండే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇన్సాకాగ్‌ (ఇండియన్‌ సార్స్‌ కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం).. కరోనా వేరియెంట్‌ల కదలికలపై, కేసుల పెరుగుదలపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించే కేంద్ర ఆధీన విభాగం. 

చదవండి: శారీరకంగా కలవడం వల్లే వైరస్‌ విజృంభణ!

మరిన్ని వార్తలు