ప్రకాశం బ్యారేజీ నుంచి సీ ప్లేన్‌ సేవలు..!

2 Nov, 2020 03:21 IST|Sakshi

14 వాటర్‌ ఏరోడ్రోమ్‌ల నిర్మాణానికి కేంద్ర సర్కారు ప్రణాళికలు

న్యూఢిల్లీ: గుజరాత్‌ రాష్ట్రం నర్మదా జిల్లాలోని సర్దార్‌ పటేల్‌ ఐక్యతా శిల్పం నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్‌ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సీ ప్లేన్‌ సర్వీసు విజయవంతం కావడంతో ఇలాంటి ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్తగా 14 వాటర్‌ ఏరోడ్రోమ్‌లు నిర్మించాలని భావిస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజీ కూడా ఉంది. వాటర్‌ ఏరోడ్రోమ్‌ అంటే ప్రయాణికులు సీ ప్లేన్‌ ఎక్కడానికి, దిగడానికి అనువుగా నదిలో నిర్మించే కాంక్రీట్‌ కట్టడం. ఇది నీటిపై ఎయిర్‌పోర్టు లాంటిదే. ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్‌ నికోబార్, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల్లో సీ ప్లేన్‌ సేవలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని కేంద్ర సర్కారు నిర్ణయానికి వచ్చింది.

రీజినల్‌ కనెక్టివిటీ స్కీమ్‌ (ఆర్‌సీఎస్‌)–ఉడాన్‌ పథకంలో కొత్త ఏరోడ్రోమ్‌లు నిర్మించాలని యోచిస్తోంది. సీ ప్లేన్‌ సేవలపై హైడ్రోగ్రాఫిక్‌ సర్వే చేపట్టాలని ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐడబ్ల్యూఏఐ)ను ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ), పౌర విమానయాన శాఖ కోరాయి. అలాగే నదుల్లో కాంక్రీట్‌ జెట్టీల(వాటర్‌ ఏరోడ్రోమ్‌) నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు నౌకాయాన శాఖ వర్గాలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ సీ ప్లేన్‌ సేవలకు అనువైన ప్రాంతంగా గుర్తించినట్లు నౌకాయాన శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గుజరాత్‌లో నర్మదా నదిలో, సబర్మతి రివర్‌ఫ్రంట్‌లో ఏరోడ్రోమ్‌ల నిర్మాణాన్ని ఐడబ్ల్యూఏఐ రికార్డు స్థాయిలో తక్కువ సమయంలోనే పూర్తి చేసింది. ఐక్యతా శిల్పం నుంచి సబర్మతి రివర్‌ఫ్రంట్‌ 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాని మోదీ కేవలం 40 నిమిషాల్లోనే ఈ రెండు ప్రాంతాల మధ్య సీ ప్లేన్‌లో ప్రయాణించారు.

మరిన్ని వార్తలు