ఇక స్వేచ్ఛగా ఊపిరి

24 Mar, 2022 06:01 IST|Sakshi

కోవిడ్‌ ఆంక్షలు ఉండవు

మార్చి 31 నుంచి ఎత్తివేత

కేంద్ర హోంశాఖ ప్రకటన

మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడంతో గత రెండేళ్లుగా అమల్లో ఉన్న కోవిడ్‌ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కరోనా కట్టడికి విధించిన ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్టుగా  కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. కానీ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. రెండేళ్ల క్రితం కరోనా వైరస్‌ కలకలం సృష్టించినప్పుడు 2020 మార్చి 24న కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా కోవిడ్‌ నిబంధనల్ని తెచ్చింది.

కరోనా కట్టడికి ఈ రెండేళ్లలో పలుమార్లు నిబంధనల్ని మార్చింది. గత ఏడు వారాలుగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య బాగా తగ్గిపోతూ ఉండడంతో మార్చి 31 నుంచి ఈ నిబంధనలన్నింటినీ ఎత్తివేస్తున్నట్టుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకి లేఖ రాశారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 23,913గా ఉంది. రోజు వారీ పాజిటివిటీ రేటు 0.26 శాతానికి పడిపోయింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితో 181.89 కోట్ల టీకా డోసుల్ని ఇచ్చారు. అందుకే ప్రస్తుతానికి విపత్తు నిర్వహణ చట్టం కింద అమల్లో ఉన్న  కరోనా కట్టడి ఆంక్షల్ని ఎత్తేస్తున్నట్టు అజయ్‌ భల్లా ఆ లేఖలో వివరించారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ సూచించిన విధంగా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటివన్నీ అమల్లోనే ఉంటాయి.

కరోనా వైరస్‌ ఎప్పుడు ఎలా రూపాంతరం చెందుతుందో తెలీని పరిస్థితి కాబట్టి ప్రభుత్వాలు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అజయ్‌ భల్లా ఆ లేఖలో హెచ్చరించారు. ఒకవేళ ఎక్కడైనా కేసులు పెరిగితే వెంటనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిబంధనలు అమల్లోకి తేవచ్చు. కేంద్ర హోంశాఖ చేసిన సూచనల్ని కూడా పాటించాల్సి ఉంటుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1778 కరోనా కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు