ఆకలి సూచీలో మరీ అధ్వాన్నంగా భారత్‌.. పాక్‌, నేపాల్‌ కంటే వెనుకంజలో!

15 Oct, 2022 10:52 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆకలి సూచీలో మన దేశం పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ప్రకారం.. 2022 ఏడాదికిగానూ భారత్‌ 107వ స్థానంలో నిలిచింది. మొత్తం 121 దేశాల జాబితాలో భారత్‌కు ఈ స్థానం దక్కింది. మన పొరుగు దేశాలు శ్రీలంక (64వ ర్యాంక్‌), నేపాల్‌ (81), బంగ్లాదేశ్‌ (84), పాకిస్థాన్‌ (99) మన దేశం కన్నా ముందు ఉండడం గమనార్హం. 

చైనా, టర్కీ, కువైట్‌.. జీహెచ్‌ఐ ఇండెక్స్‌లో అత్యంత మెరుగైన స్థానంలో ఉండడం గమనార్హం. ఇక దక్షిణాసియా దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్‌ (109 ర్యాంక్‌) మాత్రమే భారత్‌ కన్నా దిగువన ఉంది. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న ఆకలి కేకల ఘంటికలను ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు ఈ నివేదిక ప్రకటించింది. 

మన దేశంలో.. చైల్డ్‌ వేస్టింగ్‌ రేటు 19.3 శాతంతో ప్రపంచంలో అత్యంత తీవ్ర సమస్యగా ఉంది. 2014 (15.1 శాతం), 2000 (17.15 శాతం) కంటే అధ్వానంగా ఉంది. భారత్‌లో పోషకాహార లోపం తీవ్రంగా ఉంది.  

గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ (జిహెచ్‌ఐ) అనేది ప్రపంచ, ప్రాంతీయ, జాతీయస్థాయిలో ఆకలిని సమగ్రంగా కొలవడానికి, గుర్తించడానికి ఒక సాధనంగా భావిస్తున్నారు.

► ఐరిష్‌కు చెందిన ఎయిడ్‌ ఏజెన్సీ ‘కన్సర్న్‌ వరల్డ్‌ వైడ్‌’, జర్మనీకి చెందిన సంస్థ ‘వెల్ట్‌ హంగర్‌ లైఫ్‌’లు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. 

► పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల, చైల్డ్‌ వేస్టింగ్‌, పిల్లల మరణాలు వంటి నాలుగు అంశాల ఆధారంగా జీహెచ్‌ఐలో స్కోరు ఇస్తారు. 

► ఈ స్కోర్లు ఆధారంగా తక్కువ, మధ్యస్థం, తీవ్రం, ఆందోళన, అత్యంత ఆందోళన అనే కేటగిరీలుగా దేశాలను విభజించారు. 

► భారత్‌కు 29.1 శాతం స్కోరుతో తీవ్రమైన ప్రభావిత దేశాల జాబితాలో నిలిచింది.

► భారత్‌లో చైల్డ్‌ వేస్టింగ్‌ రేట్‌ (వయసు కన్నా తక్కువ బరువు, ఎత్తు ఉండటం) 19.3 శాతంతో ప్రపంచంలోనే అత్యంత తీవ్రంగా ఉంది.

► 2021లో 116 దేశాల జాబితాలో భారత్‌ 101వ స్థౠనంలో నిలిచింది. ఇప్పుడు 121 దేశాల జాబితాలో 107వ ర్యాంకుకు పడిపోవడం గమనార్హం.

► ఇక భారత్‌ GHI స్కోర్ కూడా క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తోంది. 2000 సంవత్సరంలో 38.8 నుంచి 2014-2022 మధ్య 28.2 - 29.1 పరిధికి పడిపోయింది స్కోర్‌. 

మరిన్ని వార్తలు