రైతుల ఉద్యమంలో నిరసనకారులు పెరగడానికి కారణమేంటి? 

2 Apr, 2021 18:23 IST|Sakshi

వ్యవసాయ చట్టాల ఉద్యమంలో పంజాబ్‌ రైతులు ఎందుకు పాల్గొంటున్నారు?

ఢిల్లీ సరిహద్దుల్లో నాలుగు నెలలుగా కొనసాగుతున్న ధర్నా

ఈనెల 4న హరియాణా జింద్‌లో కిసాన్‌ మహాపంచాయత్‌! 

సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నాలుగు నెలలుగా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఢిల్లీ–హరియాణా సింఘు సరిహద్దులో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఉద్యమం నెమ్మదిగా చల్లబడుతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, సింఘు సరిహద్దులో ఢిల్లీ వైపు నిరసనకారుల సంఖ్య ఈమధ్య కాలంలో నెమ్మదిగా పెరుగుతోంది. సింఘు బోర్డర్‌–నరేలా రహదారిపై పంజాబ్‌ నుంచి వస్తున్న నిరసనకారుల ట్రాక్టర్ల సంఖ్య పెరిగింది.

ఇప్పుడు జరుగుతున్న ఉద్యమంలో జరుగుతున్న పరిణామాల వెనుక కొత్త కారణాలు బయటికి వస్తున్నాయని ప్రచారం ఊపందుకుంది. వాస్తవానికి ఇక్కడ కొందరు నిరసనకారులు ఆందోళన తమ హక్కుగా భావించి పాల్గొంటుంటే, మరికొంత మంది ఆందోళనలో పాల్గొనడాన్ని ఒక పనిగా భావిస్తూ పాల్గొంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు వస్తున్న పంజాబ్‌లోని కొంతమంది రైతులు స్థానికంగా విధించే జరిమానాలకు భయపడి ఉద్యమంలో పాల్గొంటున్నారు. దీంతో సింఘు సరిహద్దులో నిరసనకారుల సంఖ్య పెరిగింది. 


పంజాబ్‌లోని సుమారు 75శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన బాధ్యత వారిపై చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఇటీవల పంజాబ్‌లోని గ్రామాధిపతులు అనధికారికంగా ఒక ఆదేశాన్ని జారీ చేశారు. దీని ప్రకారం పంజాబ్‌లోని ప్రతీ కుటుంబానికి చెందిన కనీసం ఒక సభ్యుడు నెలకు ఒకసారి అయినా ఉద్యమం జరుగుతున్న సింఘు సరిహద్దుకు వచ్చి కనీసం పది రోజుల పాటు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలి. అలా చేయడంలో ఏ కుటుంబం అయినా విఫలమైతే వారికి జరిమానా విధిస్తారు. అటువంటి పరిస్థితిలో ఇక్కడకు రావడానికి ఇష్టపడని వారిని కుటుంబ సభ్యులు జరిమానాలకు భయపడి బలవంతంగా పంపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 


మరోవైపు సింఘు సరిహద్దులో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు విదేశాల నుంచి భారీగా నిధులు సమకూరుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ నిరసనలో పాల్గొంటున్న వారికి అవసరమైన ఖర్చు విషయంలో ఎవరూ వెనకడుగు వేయట్లేదు. దీంతో ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చినవారు 10 నుంచి 15 రోజుల పాటు అక్కడే నిరసన కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నారు.


సింఘు సరిహద్దుల్లో జరుగుతున్న నిరసనల్లో కేవలం పంజాబ్‌కు చెందిన వారే పాల్గొంటున్నారు. ఇతర రాష్ట్రాలైన హరియాణా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నిరసనకారులు ఎవరూలేరు. గతంలో సింఘు సరిహద్దులో యువత ఎక్కువగా కనిపించేవారు. కానీ ఇప్పుడు ఎక్కువగా వృద్ధులే నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న వారిలో అనేకమందిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. దీంతో భవిష్యత్తులో ఈ కేసులు ప్రతిబంధకంగా మారుతాయనే భయంతో ఆందోళనలో పాల్గొనే యువత సంఖ్య తగ్గిందని భావిస్తున్నారు.

 
50వేల మందితో జింద్‌లో మహా పంచాయత్‌ 
ఈనెల 4న హరియాణాలోని జింద్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిపాదించిన కిసాన్‌ మహాపంచాయత్‌ ర్యాలీని బహిష్కరిస్తున్నట్లు హరియాణా సంయుక్త మోర్చా ఇంఛార్జ్‌ ప్రదీప్‌ అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్ణయించింది. హరియాణాలో బీజేపీ–జేజేపీ ప్రభుత్వంపై రైతుల్లో పెరుగుతున్న వ్యతిరేకతను తమవైపు తిప్పుకోవాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే 4న ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సుశీల్‌ గుప్త సొంత ప్రాంతమైన జింద్‌లో 50వేల మందితో కిసాన్‌ మహా పంచాయత్‌ నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సభలో ఎలాంటి జెండాలు కానీ, పార్టీ గుర్తులు వాడబోమని ఆప్‌ తెలిపింది. 

ఇక్కడ చదవండి:

సుప్రీంకోర్టుకు ‘సాగు చట్టాల’పై నివేదిక

హోలీ మంటల్లో సాగు చట్టాల ప్రతులు

మరిన్ని వార్తలు