Coronavirus: కోవిడ్ కలకలం.. భారత్​కు వచ్చిన ప్రయాణికుల్లో 11 రకాల వేరియంట్లు

5 Jan, 2023 18:31 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పీడ ముగిసిపోయిందనుకునేలోపే మరోసారి పంజా విసురుతోంది. చైనాతోపాటు వివిధ దేశాల్లో మళ్లీ కోవిడ్‌ కేసులు ప్రబలుతున్నాయి. ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల భయం మొదలవ్వడంతో భారత్‌తో సహా అన్నీ దేశాలు అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేశాయి. దేశంలో కూడా ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌ బి.ఎఫ్‌.7 కేసులు వెలుగుచూడటంతో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. రద్దీగా ఉండే ప్రదేశాలతో పాటు అన్ని విమానాశ్రయాల్లోనూ మాస్కులు ధరించాలని తెలిపింది.

ఈ క్రమంలో విమానాశ్రయాలు, ఓడరేవుల వద్ద అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహిస్తున్న కరోనా టెస్టుల్లో వివిధ రకాల వేరియట్ల కేసులు బయట పడుతున్నాయి. తాజాగా డిసెంబర్ 24 నుంచి జనవరి 3 మధ్య ప్రయాణికులకు చేసిన కరోనా టెస్టుల్లో 11 రకాల కరోనా వైరస్ వేరియంట్లు బయటపడినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇవన్నీ ఒమిక్రాన్ సబ్ వేరియట్లేనని స్పష్టం చేశాయి. ఇందులో కొత్త వేరియంట్లేవీ లేవని.. ఇవన్నీ గతంలో దేశంలో నమోదైనవేనని పేర్కొన్నాయి.

మొత్తం 19,227 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు చేయగా.. 124 మందికి పాజిటివ్‌గా తెలినట్లు పేర్కొన్నాయి. ఈ 124 మందిలో 40 మంది నమూనాల జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 14 నమూనాల్లో.. ఎక్స్‌​బీబీ, ఎక్స్​బీబీ.1 వేరియంట్ ఆనవాళ్లు.. ఒక శాంపిల్​లో బీఎఫ్ 7.4.1 వేరియంట్ గుర్తించారు. కాగా  కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 188 కొత్త కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,554గా ఉన్నాయి. రికవరీ రేటు 98.8 శాతంగా ఉంది.
చదవండి: చైనాను వణికిస్తున్న కరోనా.. వీధుల్లోనే శవాలను కాల్చేస్తున్నారు..

మరిన్ని వార్తలు