బలమైన, ఐక్య ఆసియాన్‌

17 Jun, 2022 05:15 IST|Sakshi

ఆసియాన్‌ విదేశాంగ మంత్రుల భేటీలో ఎస్‌.జైశంకర్‌

ప్రధానితోనూ మంత్రుల సమావేశం

న్యూఢిల్లీ: అర్ధవంతమైన, దృఢమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా కృషి చేయాలని ఆసియాన్, భారత్‌ నిర్ణయించాయి. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా వాణిజ్యం, ప్రాంతీయ భద్రతకు సంబంధించి తలెత్తిన ఇబ్బందుల పరిష్కారానికి అన్వేషించాలని అంగీకరించాయి. గురువారం ఢిల్లీలో జరిగిన ఆసియాన్‌ విదేశాంగ మంత్రుల భేటీలో విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రారంభోపన్యాసం చేశారు. యుద్ధం ప్రభావం ఆహారం, ఇంధన భద్రత, వినియోగవస్తువులు, ఎరువుల ధరల పెరుగుదలతోపాటు రవాణా, సరఫరా గొలుసుపై పడిందన్నారు.

వాణిజ్యం, అనుసంధానత, రక్షణ, టీకా ఉత్పత్తి, ఇంధనం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని భారత్‌– ఆసియాన్‌ తీర్మానించాయి. ఆసియాన్‌–భారత్‌ ట్రేడ్‌ ఇన్‌ గూడ్స్‌ అగ్రిమెంట్‌ (ఏఐటీఐజీఏ)పై సమీక్ష జరపాలని నిర్ణయించాయి. 10 దేశాలతో కూడిన ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్‌)తో సంబంధాలకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ సమావేశానికి సింగపూర్, బ్రూనై, ఇండోనేసియా, కాంబోడియా, మలేసియా, వియత్నాం దేశాల విదేశాంగ మంత్రులు వారు ప్రధాని మోదీతోనూ సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు.

ఏడీపీని విస్తరించాలి: మోదీ
న్యూఢిల్లీ: ఆకాంక్ష జిల్లాల పథకం(ఏడీపీ)ను బ్లాకులు, నగరాల్లో కూడా అమలు చేయాలని ప్రధాని మోదీ కోరారు. అవి స్ఫూర్తిదాయ జిల్లాలుగా మారాలని ఆకాంక్షించారు. ‘‘దేశ వ్యాప్తంగా 112 వెనకబడ్డ జిల్లాల్లో కేంద్రం 2018 నుంచి అమలు చేస్తున్న ఈ పథకం ఎంతో విజయవంతమైంది’’ అన్నారు.  హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరుగుతున్న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల భేటీలో ప్రధాని గురువారం మాట్లాడారు. టీచర్లు డిజిటల్‌ టెక్నాలజీ, మొబైల్‌ యాప్‌లతో విద్యాబోధనను బలోపేతం చేయాలన్నారు. రిటైర్డ్‌ టీచర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ శిక్షణ కోసం ప్రత్యేకంగా టీవీ చానల్‌ అవసరం ఉందని చెప్పారు.

మరిన్ని వార్తలు