భారత్‌ ఎకానమీకి నష్టం తప్పదు!

24 Apr, 2021 13:57 IST|Sakshi

కొనసాగుతున్న వృద్ధి అంచనా కోతలు! 

ఇండియా రేటింగ్స్‌.. 10.4 నుంచి 10.1 శాతానికి డౌన్‌

ఎస్‌బీఐ రిసెర్చ్‌11 నుంచి 10.4 శాతానికి కుదింపు  

సాక్షి ముంబై: కరోనా సెకండ్‌వేవ్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని స్పష్టమవుతోంది. పలు రేటింగ్, ఆర్థిక విశ్లేషణా సంస్థలు 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలకు కోతలు విధిస్తున్నాయి. ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఇండ్‌ రా) శుక్రవారం ఏప్రిల్‌తో ప్రారంభమయిన ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ఎకానమీ వృద్ధి 10.1 శాతంగా పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 10.4 శాతంగా ఉంది. ఇక  ఎస్‌బీఐ రిసెర్చ్‌ క్రితం వృద్ధి అంచనా 11 శాతంకాగా, దీనిని తాజాగా 10.4 శాతానికి కుదించింది. ఇప్పటికే ఇక్రా, కేర్‌ రేటింగ్స్‌ భారత్‌ వృద్ధి అంచనాలను కుదించిన సంగతి తెలిసిందే. (సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు కరోనా జోష్‌!)

కేర్‌ రేటింగ్స్‌ ఏకంగా ఏప్రిల్‌లో వృద్ధి అంచనాలకు రెండుసార్లు కోతలు విధించింది.  దేశ వృద్ధి రేటు 11 శాతం నుంచి 11.2 శాతం వరకూ ఉంటుందని 2021 మార్చి 24న కేర్‌ రేటింగ్స్‌ అంచనావేసింది. అయితే సెకండ్‌వేవ్‌ ప్రారంభం నేపథ్యంలో ఏప్రిల్‌ 5వ తేదీన ఈ రేటును 10.7 శాతం నుంచి 10.9 శాతం శ్రేణికి తగ్గించింది. ఇటీవలి నివేదికలో దీనిని మరింతగా కుదించి 10.2 శాతానికి దించింది. ఇక దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ఈ వారం మొదట్లో వృద్ధి రేటు అంచనా 10–11 శ్రేణిని  10–10.5 శాతం శ్రేణికి కుదించింది.  మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25- ఏప్రిల్‌ 14, ఏప్రిల్‌ 15- మే 3, మే 4- మే 17, మే 18-మే 31) కఠిన లాక్‌డౌన్‌ అమలు ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు -7.3 శాతం త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. 2021-22లో వృద్ధి రేటు 10.5 శాతం ఉంటుందని ఈ నెలారంభంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనావేసింది. 

ఈ నేపథ్యంలో ఇండ్‌ రా, ఎస్‌బీఐ రిసెర్చ్‌ అంచనాలను పరిశీలిస్తే...  

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నత్తనడక: ఇండ్‌ రా 
ఇండియా రేటింగ్స్‌  ప్రకటన ప్రకారం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుండడం ఎకానమీపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. వైద్య రంగ మౌలిక వ్యవస్థ మొత్తంపై తీవ్ర ఒత్తిడి ఉంది. మే మధ్యస్థ నుంచి సెకండ్‌వేవ్‌ తగ్గుముఖం పట్టే వీలుంది. ఫస్ట్‌ వేవ్‌తో పోల్చితే సెంకండ్‌వేవ్‌లో ఆర్థిక వ్యవస్థకు నష్టం తక్కువగా ఉంటుంది. లాక్‌డౌన్‌లు స్థానికతకు పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం. సెకండ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు కుటుంబాలు, వ్యాపారాలు, ఇతర ఆర్థిక వ్యవస్థలు కొంత సంసిద్ధమయ్యాయి. దీనికితోడు వ్యాక్సినేషన్‌ పక్రియా కొనసాగుతోంది. అయితే ఇది మరింత వేగవంతం కావాలి. వ్యాక్సినేషన్‌ పక్రియ జీడీపీతో పోల్చితే కేంద్రంపై 0.12 శాతం భారం మోపుతుంది. రాష్ట్రాల విషయంలో ఈ భారం 0.24 శాతంగా ఉంది. 

2021లోనూ వ్యవసాయ రంగం కొంత సానుకూలంగా ఉండే వీలుంది. 2020–21లో రిటైల్, టోకు ద్రవ్యోల్బణం సగటున వరుసగా 5 శాతం, 5.9 శాతంగా కొనసాగవచ్చు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు–చేసే వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యాల మేరకు 6.8 శాతంగా ఉండవచ్చు. అయితే పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో (రూ.1.75 లక్షల కోట్లు)  విజయవంతం కావాలి. 2020–21లో మిగులులో ఉన్న కరెంట్‌ అకౌంట్‌ (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2021–22లో లోటులోకి మారే అవకాశం ఉంది. ఇది 0.4 శాతం (జీడీపీ)గా నమోదుకావచ్చు. 

59 ఏళ్ల కనిష్టానికి రుణ వృద్ధి: ఎస్‌బీఐ రిసెర్చ్‌ 
ఎస్‌బీఐ రిసెర్చ్‌ ప్రకటనలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... కోవిడ్‌–19 ప్రతికూల ప్రభావం నుంచి బయటపడ్డానికి వీలుగా కేంద్రం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పలు ద్రవ్య, పరపతి ఉద్దీపనలు ప్రకటించినప్పటికీ 2020–21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ రుణ వృద్ధి కేవలం 5.56 శాతంగా నమోదయ్యింది. గడచిన 59 సంవత్సరాల్లో (1962లో 5.38 శాతం) ఇంత తక్కువ స్థాయి రుణ వృద్ది రేటు ఎప్పుడూ నమోదుకాలేదు. గడచిన ఆర్థిక సంవత్సరం రుణ పరిమాణం 109.51 లక్షల కోట్లుగా ఉంది. కాగా డిపాజిట్లు 11.4 శాతం వృద్ధితో రూ.151.13 లక్షల కోట్లుగా నమోదయినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.

ఇక  ప్రభుత్వం 2020–21లో ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్రకటించింది. జీడీపీ విలువతో పోల్చితే ఇది 11 శాతం. అయితే దాదాపు రూ.3 లక్షల కోట్ల ఉద్దీపనలను మాత్రమే వినియోగించుకున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలి. లాక్‌డౌన్‌ల వల్ల కలిగే నష్టం కంటే వ్యాక్సినేషన్‌ వ్యయభారం చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం వ్యాక్సినేషన్‌ వ్యయ భారం ఇప్పటికి జీడీపీలో 0.1 శాతం ఉంటే, లాక్‌డౌన్‌ల వల్ల జరిగిన నష్టం ఇప్పటికి 0.7 శాతంగా ఉంటుంది. పరిమిత లాక్‌డౌన్‌ల వల్ల ఇప్పటికి రూ.1.5 లక్షల కోట్ల నష్టం జరిగిందని అంచనా. ఇందులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల వాటా 80 శాతంకాగా, ఒక్క మహారాష్ట్ర వాటా 54 శాతంగా ఉంది. 

మరిన్ని వార్తలు