భారత సైన్యం చేతికి మిసైల్‌ ‘ప్రళయ్‌’.. ఇక చైనా తోకముడవాల్సిందే!

20 Dec, 2022 17:53 IST|Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దులో రెచ్చగొట్టే చర్యలకు దిగుతూ కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. గల్వాన్‌ గర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని భూభాగాన్ని చైనా అక్రమించుకునే ప్రయత్నం చేస్తోందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ కుట్రలకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ సిద్ధమైంది. భారత సైనిక దళాల అమ్ముల పొదిలో అత్యాధునికి మిసైల్‌ చేరనుంది. ‘ప్రళయ్‌’గా పిలిచే ఈ బాలిస్టిక్‌ మిసైల్‌ 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 

బాలిస్టిక్‌ మిసైల్‌ను సైన్యంలో చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేసింది భారత రక్షణ దళం. ఈ వారంతాంలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో అందుకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి. రక్షణ శాఖలో రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని చర్చల కొనసాగుతున్న క్రమంలోనే ఈ క్షిపణిని తీసుకురావలన్న ప్రతిపాదన రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఓ సమావేశంలో నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో శత్రువులను ధీటుగా ఎదుర్కొనేందుకు రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు దివంగత సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కృషి చేసినట్లు గుర్తు చేసుకున్నారు.

ప్రళయ్‌ ప్రత్యేకతలు..
మిసైల్‌ ప్రళయ్‌ను గత ఏడాది డిసెంబర్‌లో వరుసగా రెండు రోజుల్లో విజయవంతంగా పరీక్షించారు.

► విజయవంతంగా లక్ష్యాలను ఛేదించిన ఈ క్షిపణిని సైన్యంలో చేర్చుకోవాలని బలగాలు భావిస్తున్నాయి.

► ఈ మిసైల్‌ 150- 500 కిలోమీటర్ల దూరంలోని సూదూర లక్ష్యాలను సైతం ఛేదించగలదు.

► ప్రళయ్‌ సాలిడ్‌ ప్రొపెల్లెంట్‌ రాకెట్‌ మోటారు సహా ఇతర కొత్త సాంకేతికలతో పని చేస్తుంది.

► ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే పాక్షిక-బాలిస్టిక్‌ మిసైల్‌.

► శుత్రువుల మిసైల్స్‌ను కూల్చేందుకు సైతం దీనిని ఉపయోగించేలా రూపొందించారు.

► గాల్లో కొంత దూరం వెళ్లాక దాని మార్గాన్ని మార్చుకునే సామర్థ్యం సైతం ఈ మిసైల్‌కు ఉంది.

ఇదీ చదవండి: తవాంగ్‌ ఘర్షణ: ఎటునుం‘చైనా’.. హెచ్చరిస్తున్న ఛాయా చిత్రాలు..

మరిన్ని వార్తలు