రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి

28 May, 2023 04:09 IST|Sakshi

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ 

ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి 

నీతి ఆయోగ్‌ భేటీలో  ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలని, ఈ లక్ష్య సాధన కోసం ఒక ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒక బృందంగా కలిసి పనిచేయాలన్నారు. రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని పేర్కొన్నారు.

శనివారం ఢిల్లీలో ‘నీతి ఆయోగ్‌’ ఎనిమిదో గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్ర మంత్రులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఇక ఉమ్మడి దార్శనికత(విజన్‌) అవసరమని అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రాంతాల అభివృద్ధికి, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రాలు ‘గతిశక్తి పోర్టల్‌’ను ఉపయోగించాలని చెప్పారు. ‘వికసిత్‌ భారత్‌’ సాధనకు  సుపరిపాలన కీలకమని వివరించారు.    

కీలక అంశాలపై చర్చ  
దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా తదితరులు హాజరయ్యారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు, బిహార్, రాజస్తాన్‌ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాలేదు. ఈ భేటీకి 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరయ్యారని నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు.   

కొందరు సీఎంల తీరు ప్రజా వ్యతిరేకం: బీజేపీ   
నీతి ఆయోగ్‌ సమావేశానికి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాకపోవడాన్ని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తప్పుపట్టారు. వారి నిర్ణయం ప్రజా వ్యతిరేకం, బాధ్యతారహితం అని విమర్శించారు. దేశ అభివృద్ధికి రోడ్డు మ్యాప్‌ రూపొందించడంలో నీతి ఆయోగ్‌ పాత్ర కీలకమని గుర్తుచేశారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారని ఆక్షేపించారు. 100 కీలక అంశాలపై చర్చించే గవర్నింగ్‌ కౌన్సిల్‌ భేటీకి ముఖ్యమంత్రులు రాకపోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దీనివల్ల వారు తమ రాష్ట్రాల వాణిని వినిపించే అవకాశం కోల్పోయారని తెలిపారు. ప్రధాని మోదీని ఇంకెంత కాలం ద్వేషిస్తారని రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. మోదీని ద్వేషించడానికి ఇంకా చాలా అవకాశాలు వస్తాయని, మరి ప్రజలకెందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు.

మరిన్ని వార్తలు