జనాభాలో చైనాను దాటేశాం

19 Jan, 2023 02:13 IST|Sakshi

డిసెంబర్‌ 31 నాటికే మన జనాభా 141.7 కోట్లుచైనా జనాభా 141.2 కోట్లు: డబ్ల్యూపీఆర్‌ నివేదిక

న్యూఢిల్లీ: మరో మూడు నెలల తర్వాత జరుగుతుందనుకున్నది కొన్నాళ్ల క్రితమే జరిగిపోయిందా? జనాభాలో మనం చైనాను దాటేశామా? ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా అవతరించామా!! అవుననే అంటోంది వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ (డబ్ల్యూపీఆర్‌) నివేదిక. గతేడాది చివరి నాటికే భారత జనాభా చైనా కంటే కనీసం 50 లక్షలు ఎక్కువని చెబుతోంది. 2022 డిసెంబర్‌ 31 నాటికి తమ జనాభా 141.2 కోట్లని చైనా మంగళవారం అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. అదే రోజున భారత్‌ జనాభా 141.7 కోట్లకు చేరిందని డబ్ల్యూపీఆర్‌ అంచనా వేసింది. తాజాగా బుధవారం నాటికి 142.3 కోట్లకు ఎగబాకిందని చెప్పుకొచ్చింది. మాక్రోట్రెండ్స్‌ అనే మరో సంస్థ అంచనాల ప్రకారం బుధవారం నాటికి భారత జనాభా 142.8 కోట్లు.

మన జనాభాలో 50 శాతానికి పైగా 30 ఏళ్లో లోపు వయసువారే. కనుక దేశ జనాభా పెరుగుదల 2050 దాకా కొనసాగుతూనే ఉంటుందని భావిస్తున్నారు. 1961 తర్వాత తొలిసారిగా 2022లో తమ జనాభాలో తొలిసారిగా 8.5 లక్షల మేరకు తగ్గుదల నమోదైనట్టు చైనా మంగళవారం ప్రకటించడం తెలిసిందే. ఈ ధోరణి ఇలాగే కొనసాగి 2050 కల్లా ఆ దేశ జనాభా 131 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా. ఆ సమయానికి భారత జనాభా 166 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. పదేళ్లకోసారి జరిగే ఆనవాయితీ మేరకు మన దేశంలో 2020లో జరగాల్సిన జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడటం తెలిసిందే. దాంతో మన జనాభాపై అధికారికంగా తాజా గణాంకాలు అందుబాటులో లేవు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు