పాక్‌కు భారత్‌ నోటీసులు.. సింధు జలాల ఒప్పందం మార్చుకుందామా?

27 Jan, 2023 16:48 IST|Sakshi

సింధునది జలాల(ఇండస్‌ వాటర్‌ ట్రిటీ(ఐడబ్య్లూటీ)) విషయమై పాకిస్తాన్‌కు, భారత్‌కు మధ్య చాలా ఏళ్లు విభేదాలు ఉన్నాయి. ఐతే ఇప్పుడూ అనూహ్యంగా ఈ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సింధు నది జలాల ఒప్పందం మార్చుకుందాం అంటూ భారత్‌ పాక్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు భారత్‌ సింధు జలాల కమిషనర్ల ద్వారా జనవరి 25న పాక్‌కు నోటీసులు పంపింది. ఈ నోటీసు ప్రకారం.. పాక్‌ భారత్‌ల మధ్య ఈ విషయమై 90 రోజల్లోగా చర్చలు జరగాల్సి ఉంటుంది. అలాగే ఈ 62 ఏళ్లలో నేర్చుకున్న పాఠాల ఆధారంగా ఈ వివాదాన్ని సరైన విధ​ంగా పరిష్కారించుకుని అప్‌డేట్‌ చేసుకునేందుకు మార్గం సుగం అవుతుంది.

వాస్తవానికి కిషన్‌ గంగా, రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ల(హెచ్‌ఈపీ) వివాదాల పరిష్కారంలో పాక్‌ వ్యవహిరించిన మొండితనం కారణంగానే భారత్‌ ఈ నోటీసులు ఇచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 2015లో తొలిసారిగా పాక్‌ భారత్‌కు చెందిన కిషన్‌ గంగా, రాట్లే జల విద్యుత్‌ ప్రాజెక్టులపై సాంకేతిక అభ్యంతరాలను పరిశీలించేందుకు నిపుణుడిని నియమించాల్సిందిగా కోరింది. ఆ తదనంతరం 2016లో పాక్‌ తన అ‍భ్యర్థనను ఏకపక్షంగా ఉపసంహరించుకుంది. తన అభ్యంతరాలను మధ్యవర్తిత్వ న్యాయస్థానం ద్వారా నిర్ణయించాలని పాక్‌ సూచించింది. దీన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించి... ఈ వ్యవహారాన్ని తటస్థ నిపుణుడికి అప్పగించాలని ప్రపంచ బ్యాంకును కోరింది.

2016లో ప్రపంచ బ్యాంకు స్పందిస్తూ.. ఇరు దేశాల అభ్యర్థనను నిలిపివేసింది. ఈ విషయంలో శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాల్సిందిగా ఇరు దేశాలను సూచించింది. ఐతే పాక్‌ ఒత్తిడి మేరకు ప్రపంచ బ్యాంకు తటస్థ నిపుణుడితో పాటు మద్యవర్తిత్వ కోర్టు ప్రకియ రెండింటిని ప్రారంభించింది. దీంతో భారత్‌ స్పందించి. .ఒకే విషయంపై రెండు చర్యలు తీసుకోవడం అంటే.. సిందు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడం కిందకే వస్తుందని ఆరోపణలు చేసింది. 2017 నుంచి 2022 వరకు ఈ విషయమై పరిష్కారం కోసం భారత్‌ నిరంతరం ప్రయత్నించినప్పటికీ..ఈ విషయాన్ని చర్చించేందుకు పాక్‌ నిరాకరించింది. తరుచుగా ఒప్పంద నియమాలకు పాక్‌ ఆటంకం కలిగించింది. అందువల్లే భారత్‌ బలవంతంగా పాక్‌కు ఈ నోటీసులు జారీ చేసిందని అధికారిక వర్గాలు తెలిపాయి.

ఈ ఒప్పందం ఎప్పుడూ ఏర్పడిందంటే...
వాస్తవానికి భారత్‌ పాక్‌ల మధ్య 1960 సెప్టెంబర్‌ 19న సింధు జలాల ఒప్పందం(ఇండస్‌ వాటర్‌ ట్రిటీ(ఐడబ్ల్యూటీ) జరిగింది. ఈ ఒప్పందంపై భారత్‌ మాజీ ప్రధాని జవహార్‌ లాల్‌ నెహ్రు, పాక్‌ మాజీ ప్రధాని అయాబ్‌ ఖాన్‌ ఇద్దరూ సంతకాలు చేశారు. ఆ తర్వాత కొన్నేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం.. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇరుదేశాలకు జలాల పంపకాలు జరిగాయి. ఈ సింధు జలాల ఒప్పందంలో భాగంగా భారత్‌కు సట్లైజ్‌, బియాస్‌, రావి నదులు, పాక్‌కు జీలం, చినాబ్‌, సింధు నదులు దక్కాయి. 

(చదవండి: రాహల్‌ జోడో యాత్రకు సడెన్‌ బ్రేక్‌! కేవలం కిలోమీటర్‌ తర్వాతే..)


 

మరిన్ని వార్తలు