కొత్త ఏడాది శుభవార్త !

1 Jan, 2021 08:28 IST|Sakshi

ఏ క్షణంలోనైనా వ్యాక్సిన్‌ 

అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్‌ అన్న డీసీజీఐ

అత్యవసర వాడకంపై నేడు నిర్ణయం ? 

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్‌ వచ్చేస్తుందన్న శుభవార్త కొత్త ఏడాదిలో వింటామని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) వీజీ సోమని సూచన ప్రాయంగా వెల్లడించారు. ఈ ఏడాది నిజంగానే వెరీ హ్యాపీ న్యూ ఇయర్‌ అని ఆయన వ్యాఖ్యానించారు. చేతిలో ఏదో ఒక వ్యాక్సిన్‌తో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ భారత్‌ సంబరాలు చేసుకునే అవకాశాలున్నాయని అందుకే ఈ ఏడాది అందరికీ హ్యాపీ న్యూ ఇయర్‌ అని ఆయన అన్నారు. బయో టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ గురువారం నిర్వహించిన వెబినార్‌లో సోమని మాట్లాడుతూ పరిశోధనా సంస్థలు, బయో టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కి ఇది పరీక్షా సమయమని అన్నారు.  కరోనా కేసులు, బ్రిటన్‌ కొత్త స్ట్రెయిన్‌ కలకలం  నేపథ్యంలో అనుమతుల మంజూరు ప్రక్రియ వేగవంతం చేశామని చెప్పారు. అయితే టీకా భద్రత, సామర్థ్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. 

వ్యాక్సిన్‌పై నేడు నిర్ణయం..? 
దేశంలో ఇప్పటికే సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ), భారత్‌ బయోటెక్, ఫైజర్‌ కంపెనీలు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ అత్యవసర అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి.  ఆ వ్యాక్సిన్‌ల అనుమతులకు సంబంధించి చర్చించడానికి సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ) గురువారం మరోసారి సమావేశం కానుంది. బుధవారం నాడు ఒక దఫా చర్చలు జరిపిన  ఈ సంస్థ  కొత్త సంవత్సరం ప్రారంభం రోజు మరింత లోతుగా చర్చించాలని  నిర్ణయించింది. దీంతో వ్యాక్సిన్‌కు అనుమతులు మంజూరు చేస్తారేమోనన్న ఉత్కంఠ నెలకొంది. కోవిడ్‌–19పై ఏర్పాటు చేసిన సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ (ఎస్‌ఈసీ) సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్, భారత్‌ బయోటెక్‌ ఇచ్చిన సమాచారాన్ని ఇప్పటికే విశ్లేషించి కేంద్రానికి నివేదిక సమర్పించింది. 

వ్యాక్సిన్‌ పంపిణీకి వ్యూహాలు
వ్యాక్సిన్‌ పంపిణీలో సమాచార లోపం తలెత్తకుండా వ్యూహాలను రచిస్తూ కేంద్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది.  ప్రజలందరూ వ్యాక్సినేషన్‌ వివరాలన్నీ తెలుసుకునేలా జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమాచారాన్ని పంచుకునే వీలుండేలా వ్యూహాలను రచించింది. వ్యాక్సిన్‌పై అపోహలుంటే తొలగిపోయేలా అన్ని రాష్ట్రాలు సమాచారం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అడిగిన వారందరికీ వ్యాక్సిన్‌పై సమాచారాన్ని ఇవ్వడం, ప్రజల్లో అపోహలు తొలగించడం, వ్యాక్సిన్‌ తీసుకోవాలన్న ఆసక్తిని కలిగించడం వంటివి చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.   

రేపు దేశవ్యాప్తంగా టీకా డ్రైరన్‌
కరోనా వ్యాక్సిన్‌కు త్వరలోనే అనుమతులు లభిస్తాయన్న అంచనాలున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ శనివారం నాడు టీకా డ్రైరన్‌ను నిర్వహించనున్నారు. వ్యాక్సినేషన్‌ సమయంలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించడానికి, టీకా పంపిణీ ప్రణాళిక సమర్థవంతంగా అమలవుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ డ్రైరన్‌ను నిర్వహించనున్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. అన్ని రాష్ట్రాల రాజధానుల్లోని ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో ఈ డ్రైరన్‌ నిర్వహించనున్నారు. చాలా రాష్ట్రాల్లో సిబ్బంది, మౌలిక సదుపాయాల కొరత ఉండడంతో ముందస్తుగా సమస్యల్ని గుర్తించడం కోసమే డ్రై రన్‌ నిర్వహించనున్నట్టుగా కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సన్నద్ధతపై సమీక్షించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో కేంద్రం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తలు