Tiger Raja: మిస్‌ యూ రాజా.. దేశంలో సుదీర్ఘకాలం బతికిన పెద్దపులి కన్నుమూత

11 Jul, 2022 19:56 IST|Sakshi

కోల్‌కతా: దేశంలో సుదీర్ఘకాలం జీవించిన రికార్డు దక్కించుకున్న పెద్ద పులి ఇక లేదు. తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య వచ్చిన ఆ పులి.. ఇన్నేళ్లు బతుకుతుందని ఎవరూ అనుకోలేదు.  అధికారిక లెక్కల ప్రకారం.. రాజా అనే పెద్దపులి 25 ఏళ్ల కంటే ఎక్కువే బతికింది. సోమవారం వేకువజామున ఎస్‌కేబీ(సౌత్‌ ఖైర్‌బరి) రెస్క్యూ సెంటర్‌లో అది కన్నుమూసినట్లు ఫారెస్ట్‌ అధికారులు ప్రకటించారు. 

2008, ఆగష్టులో నార్త్‌ బెంగాల్‌ సుందర్‌బన్‌ అడవుల్లో  ఓరోజు మొసలితో పోరాడి తీవ్రంగా గాయపడ్డ ఓ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ను..  సౌత్‌ ఖైర్‌బరి టైగర్‌ రెస్క్యూ సెంటర్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో అది బతుకుతుందని ఎవరూ అనుకోలేదు. వైద్య బృందం, నిర్వాహకులు శ్రమించి దానిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ‘రాజా’ దాదాపు పదిహేనేళ్లు బతికింది. తద్వారా దేశంలో సుదీర్ఘ కాలం జీవించిన పెద్దపులి(అధికారుల అంచనా)గా రాజా(25 ఏళ్ల 10 నెలలు) రికార్డుకెక్కింది.

రాజా మృతిపై నిర్వాహకులతో పాటు పలువురు సోషల్‌ మీడియాలో ‘ వీ మిస్‌ యూ రాజా’ అంటూ నివాళులు అర్పిస్తున్నారు. దానిని చూసేందుకు సందర్శకులు చాలామంది వచ్చేవారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఉత్తర ప్రదేశ్‌ కాన్పూర్‌ జూలో గుడ్డు అనే పెద్దపులి 2014 జనవరిలో మృతి చెందింది. అప్పటికి దాని వయసు 26 ఏళ్లు అని నిర్వాహకులు ప్రకటించినా.. ఆ తర్వాత ఆ వయసులో తేడా ఉందని ఫారెస్ట్‌ అధికారులు గుర్తించారు. దీంతో రాజా పేరిట రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చాకే.. రాజా ఎలా చనిపోయిందన్నది తేలుతుందని అధికారులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు