అది ప్రపంచ వాణిజ్యానికి అడ్డా

25 Sep, 2023 05:21 IST|Sakshi

‘భారత్‌–మధ్యప్రాచ్యం– యూరప్‌’ కారిడార్‌పై ప్రధాని మోదీ

న్యూఢిల్లీ:   భారత్‌–మధ్యప్రాచ్యం–యూరప్‌ ఆర్థిక నడవా(కారిడార్‌) రాబోయే కొన్ని శతాబ్దాలపాటు ప్రపంచ వాణిజ్యానికి ప్రధాన ఆధారం కాబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ కారిడార్‌ ఆలోచన భారత్‌ గడ్డపైనే పుట్టిందన్న విషయాన్ని చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. ఆదివారం 105వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. ప్రాచీన కాలంలో వాణిజ్య మార్గంగా ఉపయోగపడిన సిల్క్‌ రూట్‌ గురించి ప్రస్తావించారు.

ఈ మార్గం ద్వారా భారత్‌ విదేశాలతో వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిందని అన్నారు. ఇటీవల జీ20 శిఖరాగ్ర సదస్సులో ఇండియా–మిడిల్‌ ఈస్ట్‌–యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ను భారత్‌ ప్రతిపాదించిందని గుర్తుచేశారు. ఈ కారిడార్‌తో శతాబ్దాల పాటు భారీ స్థాయిలో ప్రపంచ వాణిజ్యం జరుగుతుందని వెల్లడించారు. ఢిల్లీలో జీ20 సదస్సు జరిగిన ‘భారత్‌ మండపం’ ఒక సెలబ్రిటీగా మారింది.  జీ20లో భాగంగా ఈ నెల 26న ఢిల్లీలో ‘జీ20 యూనివర్సిటీ కనెక్ట్‌ ప్రోగ్రాం’ నిర్వహించబోతున్నామన్నారు.

అక్టోబర్‌ 1న ఉదయం 10 గంటలకు భారీ స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టబోతున్నారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశీయంగా తయారైన ఖాదీ, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలను కోరుతున్నానన్నారు.  

హైదరాబాద్‌ బాలిక ఆకర్షణ కృషి ప్రశంసనీయం  
హైదరాబాద్‌కు చెందిన 11 ఏళ్ల ఆకర్షణ సతీష్‌ గురించి  మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆకర్షణ సతీష్‌ ఏడో తరగతి చదువుతోందని, నిరుపేద విద్యార్థుల కోసం ఏడు గ్రంథాలయాలు నడుపుతోందని ప్రశంసించారు. ఇరుగుపొరుగు, బంధువులు, స్నేహితుల నుంచి పుస్తకాలు సేకరించి, లైబ్రరీల్లో అందుబాటులో ఉంచుతోందని చెప్పారు.  ఏడు లైబ్రరీల్లో దాదాపు 6,000 పుస్తకాలు అంబాటులో ఉన్నాయని తెలిపారు. చిన్నారుల భవిష్యత్తు కోసం ఆకర్షణ సతీష్‌ కొనసాగిస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిని ఇస్తోందని ప్రధానమంత్రి కొనియాడారు.

మరిన్ని వార్తలు