ఒకే దేశం.. ఒకే ఎన్నిక

27 Nov, 2020 05:12 IST|Sakshi

జమిలి ఎన్నికలు దేశానికి అవసరం

తరచూ జరిగే ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకం

ఆల్‌ ఇండియా ప్రిసైడింగ్‌ ఆఫీసర్స్‌ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ 

సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు (‘వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌’) ఆలోచన అనేది కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేయలేమని, ఈ ఆలోచన ప్రస్తుతం దేశ అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం గుజరాత్‌ కెవాడియాలో జరిగిన 80వ అఖిల భారత ప్రిసైడింగ్‌ ఆఫీసర్స్‌ కాన్ఫరెన్స్‌ ముగింపు సమావేశంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రసంగించారు. దేశవ్యాప్తంగా కొన్ని నెలల వ్యవధిలో నిర్వహించే ఎన్నికలు, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తాయని, ఈ కారణంగా ఎన్నికలను ఒకేసారి నిర్వహించడంపై దృష్టి పెట్టాలని అన్నారు. 

ఈ విషయంలో లోతైన అధ్యయనం, చర్చ అవసరమని ప్రధాని పునరుద్ఘాటించారు. ప్రిసైడింగ్‌ అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకొని ఈ అంశంపై చర్చకు నాంది పలకాలన్నారు. జాతీయ, రాష్ట్ర, పంచాయతీ, స్థానిక ఎన్నికలకు వేర్వేరు ఓటింగ్‌ కార్డులు అవసరం లేదని తెలిపారు. ఓటరు కార్డులను క్రమబద్ధీకరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారు. లోక్‌సభ, విధానసభ, ఇతర ఎన్నికలకు ఒకే ఓటరు జాబితాను మాత్రమే ఉపయోగించాలని, ఈ జాబితాల తయారీకి ఎందుకు సమయం, నిధులు వృథా చేస్తున్నామని మోదీ ప్రశ్నించారు. 

రాజ్యాంగం, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ‘వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌’ను కీలకంగా పొందుపరిచింది. ఈ అంశంపై మోదీ ఇప్పటికే అనేకసార్లు ప్రసంగించారు. ‘వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌’పై చర్చించేందుకు గతేడాది జూన్‌లో ప్రధాని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేకమంది కీలక నాయకులు హాజరుకాకపోవడంతో ఈ విషయంపై చర్చ సరిగ్గా జరగలేదు. 

1970ల్లో అత్యవసర పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ, అధికారాన్ని వేరు చేసేందుకు జరిగిన ప్రయత్నానికి సమాధానం, రాజ్యాంగం నుంచే వచ్చిందని మోదీ అన్నారు. అయితే, ఆ సందర్భం నుంచి శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు ఎన్నో కీలకాంశాలను నేర్చుకొని మరింత బలపడ్డాయని తెలిపారు. ఈ మూడు వ్యవస్థలపై 130 కోట్ల మంది భారతీయులకు ఉన్న విశ్వాసం కారణంగానే ఇది సాధ్యమైందని, ఈ విశ్వాసం మారుతున్న సమయానికి అనుగుణంగా మరింత బలపడిందని ప్రధాని తెలిపారు. మన రాజ్యాంగం అందించిన బలం కష్ట సమయంలోనూ సాయ పడుతుందని ప్రధాని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రాజెక్టులను పెండింగ్‌లో ఉంచే ధోరణికి వ్యతిరేకంగా ముందుకు సాగాలని ప్రధాని హెచ్చరించారు. 

దేశంలో చట్టాల భాష మరింత సరళంగా, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. దీని ద్వారా ప్రజలు ప్రతి చట్టంతో ప్రత్యక్ష సంబం«ధాన్ని పొందగలుగుతారని తెలిపారు. వాడుకలో లేని చట్టాలను తొలగించే ప్రక్రియ సరళంగా ఉండాలని, పాత చట్టాలను సవరించేటప్పుడు వాటిని రద్దు చేసే వ్యవస్థ స్వయంచాలకంగా ఉండాలని ప్రధాని సూచించారు. నో యువర్‌ కస్టమర్‌(కేవైసీ)ని కార్పొరేట్‌ సంస్థల్లో వినియోగించుకున్నట్లే ప్రతి పౌరుడికీ మన రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు నో యువర్‌ కాన్‌స్టిట్యూషన్‌(కేవైసీ) అవసరమన్నారు. బాధ్యతలు తెలుసుకుని మసలుకునే వారికి హక్కులు కూడా వాటంతటవే సమకూరుతాయన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో బిహార్లో ఎన్నికలు సజావుగా నిర్వహించడాన్ని మోదీ ప్రశంసించారు.

ముంబై దాడి గాయాన్ని దేశం మరువదు
12 ఏళ్ల క్రితం ఇదే రోజు జరిగిన 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భద్రతా దళాలకు ఈ సందర్భంగా ప్రధాని నివాళులర్పించారు. ‘ఇదే రోజు 2008లో దేశంపై అతిపెద్ద ఉగ్రదాడి జరిగింది. అనేక దేశాలకు చెందిన వారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ నా నివాళులు. ముంబై దాడులతో ఏర్పడిన గాయాలను దేశం ఎన్నటికీ మరువదు. ఉగ్రవాదులపై జరిగిన పోరులో ప్రాణాలర్పించిన జవాన్లకు ఘన నివాళులు’అని అన్నారు. మోదీ, కొత్త పంథాలో దేశం ఉగ్రవాదంపై పోరాడుతోందని తెలిపారు. ఉగ్ర పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్న భద్రతా బలగాలను ఆయన ప్రశంసించారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా