1959 నాటి చైనా వాదనను అంగీకరించం

30 Sep, 2020 10:38 IST|Sakshi

ఎల్‌ఏసీపై గత ఒప్పందాలకు కట్టుబడి ఉండాలి

న్యూఢిల్లీ: 1959 నాటి వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)కు కట్టుబడి ఉంటామంటూ చైనా లేవనెత్తిన సరికొత్త వాదనను భారత్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. సుమారు ఐదు నెలలుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ సమయంలో.. వాస్తవ సరిహద్దుల గురించి ఇలాంటి ‘ఆమోద యోగ్యం కాని ఏకపక్ష’’ భాష్యం చెప్పవద్దని కోరింది. ‘చైనా ఏకపక్షంగా నిర్వచించిన 1959 ఎల్‌ఏసీని భారత్‌ ఎన్నడూ ఆమోదించలేదు. ఈ విషయం చైనా సహా అందరికీ తెలుసు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ మంగళవారం మీడియాతో అన్నారు.

1959లో అప్పటి చైనా ప్రధాని చౌఎన్‌లై, భారత ప్రధాని నెహ్రూకు రాసిన లేఖలో పేర్కొన్న ఎల్‌ఏసీని తాము గుర్తిస్తామంటూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ‘హిందుస్తాన్‌ టైమ్స్‌’కు తెలపడంపై శ్రీవాస్తవ ఈ మేరకు స్పందించారు. ప్రస్తుతం ఉన్న ఎల్‌ఏసీని గుర్తిస్తూ 1993, 1996, 2005 సంవత్సరాల్లో ఒప్పందాలతోపాటు తాజాగా సెప్టెంబర్‌ 10వ తేదీన రెండు దేశాల మధ్య అవగాహన కూడా కుదిరిందని ఆయన గుర్తు చేశారు. భారత్‌ ఎల్లప్పుడూ ఎల్‌ఏసీని గౌరవించి, కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఇకనైనా రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, అవగాహనలకు యథాతథంగా చైనా కట్టుబడి ఉంటుందని, ఎల్‌ఏసీకి ఆమోదయోగ్యం కాని, ఏకపక్ష భాష్యాలను మానుకుంటుందని భారత్‌ ఆశిస్తోందని పేర్కొన్నారు. 

‘యుద్ధం లేదు.. శాంతి లేదు’
ప్రస్తుతం తూర్పు లద్దాఖ్‌లో భద్రతా పరమైన పరిస్థితి ‘యుద్ధం లేదు.. శాంతి లేదు’అన్నట్టుగా ఉందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ బదౌరియా చెప్పారు. ఆయన మంగళ వారం ఏరోస్పేస్‌ పరిశ్రమపై జరిగిన సదస్సులో మాట్లాడారు. దేశ సరిహద్దుల్లో ఎలాంటి ప్రతికూల పరిణామాలు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనే సత్తా వైమానిక దళానికి ఉందన్నారు. 

6న క్వాడ్‌ విదేశాంగ మంత్రుల భేటీ
చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఏర్పడిన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాల చతుర్భుజ కూటమి (క్వాడ్రిలేటరల్‌ కోయెలిషన్‌) దేశాల విదేశాంగ మంత్రులు అక్టోబర్‌ 6న జపాన్‌ రాజధాని టోక్యోలో సమావేశం కానున్నారు. భారత్‌ విదేశాంగ మంత్రి జైశంకర్‌ పాల్గొంటారు. 

మరిన్ని వార్తలు