ఈ ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరణాలు లేవు

28 Apr, 2021 12:25 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ రూపంలో కల్లోలాన్ని సృష్టిస్తోంది. ప్రతిరోజు కేసులతో పాటు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. భారత్‌లో మంగళవారం ఒక్కరోజే 3,60,960 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే విధంగా మహమ్మారి బారినపడి నిన్న ఒక్కరోజే 3,293 మంది బాధితులు ప్రాణాలు విడిచారు. ఈ నేఫథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు న‌మోదు అవుతున్న‌ప్ప‌టికీ, మంగ‌ళ‌వారం నాడు ఒక్క మరణం కూడా న‌మోదు కాలేదు. దీంతో అక్కడి ప్రభుత్వాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలతో భారత్‌ ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఈ వార్త కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. 

కాస్త ఉపశమనం 
గడిచిన 24 గంటలలో ఈ 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అవి.. త్రిపుర‌, మిజోరం, నాగాలాండ్‌, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, దాద్రా న‌గ‌ర్ హావేలి, ల‌డ‌ఖ్‌, ల‌క్ష‌ద్వీప్, అండ‌మాన్ నికోబార్ దీవులు. ఆయా ప్రాంతాల్లో నిన్న క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాకపోవడంతో అక్కడి ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరో వైపు కొత్తగా వస్తున్న కేసుల్లో మ‌హారాష్ర్ట‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఛత్తీస్‌గఢ్‌, ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్ రాష్ర్టాల నుంచి 71.68 శాతం కేసులు న‌మోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే ఆ రాష్ట్ర  ప్రభుత్వాలు కేసుల కట్టడి కోసమని లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వంటి కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. 

( చదవండి: Corona Deaths in India: కొనసాగుతున్న హాహాకారాలు )

మరిన్ని వార్తలు