Vaccination: మనమే నంబర్‌ 1..!

29 Jun, 2021 04:39 IST|Sakshi

వ్యాక్సినేషన్‌లో అమెరికాను వెనక్కినెట్టిన భారత్‌

దేశంలో 32.36 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌ల పంపిణీ

అమెరికాలో ఇప్పటివరకు అందించిన డోస్‌లు 32.33 కోట్లు

24 గంటల్లో దేశవ్యాప్తంగా 46,148 కొత్త కేసులు

5,72,994కు తగ్గిన యాక్టివ్‌ కేసులు

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ విషయంలో భారత్‌ అమెరికా రికార్డును దాటేసింది. దేశంలో ఇప్పటివరకు 32.36 కోట్ల డోస్‌లను అందించారు. కాగా మన దేశం కంటే సుమారు ఒక నెల ముందు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన అమెరికాలో ఇప్పటివరకు 32.33 కోట్ల మందికి వ్యాక్సిన్‌ డోస్‌లను ఇచ్చారు. భారత్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఈ ఏడాది జనవరి 16వ తేదీన ప్రారంభంకాగా, అమెరికాలో 2020 డిసెంబర్‌ 14న మొదలైంది. కాగా, యూకేలో గతేడాది డిసెంబర్‌ 8న, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాల్లో డిసెంబర్‌ 27న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లను ప్రారంభించారు.

సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 32,36,63,297 టీకా డోస్‌లు ఇచ్చారు. దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో భారత్‌ ఈ రికార్డు సాధించింది. దేశంలో ఇప్పటివరకు 5.6% మందికి వ్యాక్సిన్‌ డోస్‌లను అందించగా, అమెరికా జనాభాలో 40% కంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేశారు. గత వారం 3 కోట్ల 91 లక్షల మందికి వ్యాక్సిన్‌ డోస్‌లను భారత్‌ ఇచ్చింది. ఇది ఒక మైలురాయి అని ఆరోగ్య శాఖ తాజాగా ట్విట్టర్‌లో పేర్కొంది. కెనడా, మలేసియా వంటి దేశాల జనాభా కంటే ఎక్కువ మందికి ఒక వారంలోనే వ్యాక్సిన్‌లు అందించారు. కరోనా వైరస్‌కు కారణంగా పరిగణిస్తున్న చైనా, ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో వ్యాక్సిన్లు వేసింది.

చైనా ప్రభుత్వం ప్రకారం, దేశంలో 117 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను అందించారు. 22.3 కోట్ల మంది ప్రజలు రెండు డోస్‌లను తీసుకున్నారు. అయితే, చైనా ప్రభుత్వం అందించే డేటాను ప్రపంచం విశ్వసించట్లేదు. అందువల్ల ఈ డేటాను ఎక్కడా చేర్చలేదు. ఇప్పటివరకు అక్కడ 91 వేల కరోనా కేసులు మాత్రమే గుర్తించారు. అదే సమయంలో అమెరికాలో ఈ సంఖ్య 3 కోట్లకు చేరుకుంది. కరోనాకు సంబంధించి చైనా నమోదుచేసిన డేటాను ప్రపంచదేశాలు అనుమానాస్పదంగానే పరిగణిస్తున్నాయి.  మరోవైపు ప్రపంచవ్యాప్తంగా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ 12 దేశాలలో ఆందోళన కలిగిస్తోందని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో దేశంలోని 12 రాష్ట్రాల్లో 50కి పైగా కేసులు నమోదయ్యాయి.  

76 రోజుల్లోనే అతి తక్కువ మరణాలు
దేశంలో గత 24 గంటల్లో 46,148 కొత్త కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గత 21రోజులుగా లక్ష కన్నా తక్కువగా రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, ఒక్క రోజు వ్యవధిలో వెయ్యిలోపు మరణాలు నమోదయ్యాయి. గడిచిన 76 రోజుల్లోనే అతి తక్కువగా నమోదైన 979 మరణాలతో మొత్తం బాధిత మృతుల సంఖ్య 3,96,730కు చేరుకుంది. దేశంలో  యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,72,994గా ఉంది. గత 24 గంటల్లో యాక్టివ్‌ కేసులు మరో 13,409 తగ్గాయి.  మొత్తం పాజిటివ్‌ కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.89 శాతం మాత్రమేనని కేంద్రం తెలిపింది.

వ్యాక్సినేషన్‌ ఊపందుకుంటోంది: ప్రధాని మోదీ
దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఊపందుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. ‘అందరికీ టీకా, అందరికీ ఉచితంగా’ విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీల కంటే ఎక్కువ టీకాలు ఇచ్చిన దేశంగా భారత్‌ అవతరించిన నేపథ్యంలో ట్విట్టర్‌లో ప్రధాని ఈ మేరకు స్పందించారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో పాలుపంచుకుంటున్న అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు