దేశానికి డ్రోన్ల రక్ష; భారత్‌ సరికొత్త వ్యూహం!

12 Mar, 2021 17:45 IST|Sakshi

ఇందుగలడు.. అందుగలడు అన్నట్లు యుద్ధ క్షేత్రంలోకి కూడా డ్రోన్లు చొచ్చుకొస్తున్నాయి. మానవరహిత డ్రోన్ల సాయంతో ప్రత్యర్థుల ప్రదేశాల్లోకి వెళ్లి విధ్వంసం సృష్టించడానికి అన్ని దేశాలు సిద్ధమవుతున్నాయి. మిసైల్స్, బాంబులతో ప్రత్యర్థుల శిబిరాలపై విరుచుకుపడే డ్రోన్లను తమ అమ్ములపొదిలో చేర్చుకోవాలని భావిస్తున్నాయి. ఇలా మానవరహితంగా గగనతలం నుంచి దాడులు చేయగలిగే సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా భారత్‌ కూడా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా 30 యుద్ధ డ్రోన్లను కొనడానికి సన్నద్ధమైంది. అమెరికా కంపెనీ జనరల్‌ ఎటోమిక్స్‌తో 3 బిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ 30 డ్రోన్లను పది పది చొప్పున ఆర్మీకి, నేవీకి, వాయుసేనకు ఇవ్వనుంది. యుద్ధ విమానాలపై శత్రువులు దాడి చేస్తే పైలట్‌ ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. ఈ నష్టాన్ని నివారించాలనే లక్ష్యంతో యుద్ధ డ్రోన్ల వైపు భారత్‌ మొగ్గుచూపుతోంది. ఇప్పటి వరకూ క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలు, సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాల్లో పొరుగుదేశాల సైనికుల కదలికపై నిఘా కోసం మాత్రమే మన దేశం హెరాన్‌ డ్రోన్లను వినియోగిస్తోంది.  

వేటగాడు డ్రోన్‌ 
వేటగాడు (ప్రెడేటర్‌) డ్రోన్‌గా పిలిచే ఎంక్యూ9 రీపర్‌లోని సెన్సార్స్, రాడార్ల వ్యవస్థతో లక్ష్యాలను గుర్తించగలుగుతుంది. ఇది యుద్ధ క్షేత్రంలో 27 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేసే సామర్థ్యం కలిగిఉంది. 6 వేల నాటికల్‌ మైళ్ల వరకూ 1,700 కిలోల బరువైన మందుగుండును మోసుకెళ్లగలదు. 50 వేల అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు. శత్రుభయంకర మిసైళ్లు, లేజర్‌ నిర్దేశిత బాంబుల వర్షం కురిపించగలుగుతుంది. ఇరాక్, అప్ఘనిస్థాన్, సిరియా దేశాల్లో అమెరికా బలగాలు ఈ డ్రోన్లను వినియోగించాయి. చైనా, పాకిస్థాన్‌ల చొరబాట్ల నేపథ్యంలో కశ్మీర్, లడక్, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కింలలో ఇలాంటి హై అల్టిట్యూడ్‌ లాంగ్‌ ఎండ్యూరెన్స్‌ (హెచ్‌ఏఎల్‌ఈ) డ్రోన్ల అవసరం భారత మిలిటరీకి ఎంతో ఉంది. 

 
ముందున్న చైనా 
అన్‌మ్యాన్‌డ్‌ ఏరియల్‌ వెహికల్స్‌ (యూఏవీ)ల వినియోగం విషయంలో చైనా చాలా ముందుంది. దాయాది పాకిస్థాన్‌ కూడా డ్రాగన్‌ దేశం సహకారంతో ఇలాంటి డ్రోన్లను సమకూర్చుకోవడానికి చూస్తోంది. సాధారణ డ్రోన్ల తయారీకి చైనా ఎంత కృషి చేసిందో.. అలాగే దాడులు చేసే డ్రోన్ల తయారీకి కూడా అంతే కష్టపడింది. డ్రోన్ల టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధి విషయంలో అన్ని దేశాల కంటే చైనా ముందుంది. ఇక భారత్‌ కొనుగోలు చేసే డ్రోన్లను ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ అవసరాలకు తగ్గట్టుగా మారుస్తారని అధికారులు చెబుతున్నారు. వచ్చే వారంలో అమెరికా డిఫెన్స్‌ సెక్రటరీ లాయిడ్‌ ఆస్టిన్‌ భారత పర్యటన సందర్భంగా ఆ డ్రోన్ల కొనుగోళ్ల సంబంధించిన చర్చలు జరగనున్నాయి. కాగా, 2007లో అమెరికాతో 18 బిలియన్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే.  

దేశీయ తయారీకి మొగ్గు 
భవిష్యత్‌లో యుద్ధ క్షేత్రాల్లో కీలకమైన యూఏవీలను దేశీయంగా తయారు చేసే అవకాశాలను కూడా భారత్‌ పరిశీలిస్తోంది. యూఏవీల తయారీకి భారత్‌కు చెందిన ప్రైవేట్‌ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయి. హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఇటీవలే డ్రోన్ల తయారీకి తన బ్లూప్రింట్‌ను విడుదల చేసింది. ఈ మానవరహిత డ్రోన్లను మానవసహిత జెట్‌ ఫైటర్లకు అనుసంధానించే పనిని హెచ్‌ఏఎల్‌ ఇప్పటికే ప్రారంభించింది. జెట్‌ ఫైటర్లు 150 కిలోమీటర్ల నుంచి డ్రోన్లను కంట్రోల్‌ చేయగలవు. ఒకేసారి నాలుగు దిశల్లో నాలుగు డ్రోన్లకు జెట్‌ ఫైటర్లు లక్ష్యనిర్దేశం చేయగలవు. స్వదేశీ ఫైటర్‌ జెట్స్‌ తేజస్, జాగ్వార్‌లతో డ్రోన్లను అనుసంధానించే అవకాశం ఉందని, ఇది వచ్చే మూడు నాలుగేళ్లలో కార్యరూపం దాల్చుతుందని భావిస్తున్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు