Third Wave-R Naught Value: భారత్‌లో థర్డ్‌వేవ్‌.. మొదటి వారంలో ఆర్‌– వాల్యూ 4.. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు

9 Jan, 2022 11:06 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తున్న వేళ కరోనా వ్యాప్తిపై ఐఐటీ మద్రాస్‌ తాజాగా అధ్యయనం నిర్వహించింది. కరోనా వ్యాప్తికి సంకేతంగా నిలిచే ఆర్‌ నాట్‌ విలువ జనవరి మొదటి  వారంలో 4కి చేరుకుందని తాము చేసిన ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైందని తెలిపింది. దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ఫిబ్రవరి 1–15 మధ్య తారాస్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్‌ నాట్‌ వాల్యూ లేదంటే ఆర్‌ఒ అని పిలుస్తారు. ఈ విలువ ఒకటి కంటే తక్కువగా ఉంటేనే మనం సురక్షితంగా ఉన్నట్టు లెక్క.

డెల్టా వేరియెంట్‌ ప్రబలి కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని అతలాకుతలం చేసిన సమయంలో కూడా ఆర్‌ నాట్‌ వాల్యూ 1.69 దాటలేదు. అలాంటిది ఒమిక్రాన్‌ వేరియెంట్‌ విజృంభిస్తున్న వేళ డిసెంబర్‌ 25–31 తేదీల్లో ఆర్‌ నాట్‌ వాల్యూ 2.9 ఉంటే, జనవరి 1–6 తేదీల మధ్య అది ఏకంగా 4కి చేరుకోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కంప్యూటేషనల్‌ మోడల్‌లో ఐఐటీ మద్రాస్‌ కరోనాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తిని విశ్లేషించింది. ఈ వివరాలను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మ్యాథమెటిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జయంత్‌ ఝా శనివారం వెల్లడించారు.

  వైరస్‌ వ్యాప్తికి గల అవకాశం, కాంటాక్ట్‌ రేటు, వైరస్‌ సోకడానికి పట్టే సమయం వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని ఆర్‌ నాట్‌ వాల్యూని అంచనా వేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్‌ ఆంక్షలు అమల్లోకి రావడంతో కాంటాక్ట్‌ రేటు తగ్గి ఆర్‌ఒ విలువ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయని జయంత్‌ ఝా చెప్పారు. గత రెండు వారాల్లో కేసులు ప్రబలే తీరుపైనే తాము ప్రాథమికంగా విశ్లేషించామని, కోవిడ్‌ని అరికట్టడానికి తీసుకునే చర్యలను బట్టి ఆర్‌ వాల్యూ మారవచ్చునని జయంత్‌ తెలిపారు. ఫిబ్రవరి 1–15 మధ్య దేశంలో కేసులు ఉధృతరూపం దాలుస్తాయని, గతంలో కుదిపేసిన వేవ్‌ల కంటే ఈ సారి కేసులు భారీగా పెరుగుతాయని అంచనా వేసినట్టు వివరించారు.

2 కోట్ల మంది బాలలకు మొదటి డోసు టీకా
ఈ నెల 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల గ్రూపు బాలబాలికలకు కోసం  ప్రారంభించిన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పైగా టీకా వేసినట్లు కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో వేసిన 90,59,360 డోసులతో కలుపుకుని శనివారం రాత్రి 7 గంటల సమయానికి ఇప్పటి వరకు అర్హులందరికీ వేసిన మొత్తం డోసుల సంఖ్య 150.61 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ తెలిపారు. దేశంలోని అర్హులైన వారిలో 91% మందికి కనీసం ఒక్క డోసు టీకా అందగా, 66% మందికి టీకా రెండు డోసులూ పూర్తయినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు