India-China: ఆందోళన వద్దు.. చైనా కదలికలపై కన్నేశాం: కేంద్రం

22 Jul, 2022 09:20 IST|Sakshi

న్యూఢిల్లీ: డోక్లాం వ‌ద్ద చైనా కార్య‌క‌లాపాల‌పై ఆందోళన అక్కర్లేదని.. అవసరమైన నిఘా పెంచామ‌ని భారత ప్ర‌భుత్వం పేర్కొంది. జాతీయ భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగించే ప‌రిణామాల‌ను ఉపేక్షించబోమని, అలాంటి వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌సిగ‌డుతున్నామ‌ని తెలిపింది కేంద్రం. అంతేకాదు.. దేశ భ‌ద్ర‌త‌ను కాపాడేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వం చేప‌డుతుంద‌ని విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ప్ర‌తినిధి అరిందం బాగ్చి స్పష్టం చేశారు.

డోక్లాం వ‌ద్ద భూటాన్ వైపున చైనా ఓ గ్రామాన్ని నిర్మిస్తున్న‌ద‌ని తాజా శాటిలైట్ ఇమేజ్‌ల‌కు సంబంధించి అడిగిన ప్ర‌శ్న‌కు బాగ్చి స్పందించారు. ‘పంగ్డా’ గా చైనా వ్యవహరిస్తున్న ఈ గ్రామం కిందటి ఏడాది నుంచి ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా అక్కడ ఇళ్ల ముందు కార్‌ పార్కింగ్‌కు సంబంధించి శాటిలైట్‌ ఇమేజ్‌లు సైతం బయటకు వచ్చాయి. మరోవైపు అక్రమంగా ఎన్నో నిర్మాణాలు చేపడుతోంది డ్రాగన్‌ కం‍ట్రీ. దీంతో సరిహద్దు భద్రతపై భారత్‌లో ఆందోళన నెలకొంది.

అయితే.. డోక్లాం  స‌మీపంలో  చైనా కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన వార్త‌ల‌పై తాను నిర్ధిష్ట వ్యాఖ్య‌లు చేయ‌బోన‌ని.. దేశ భ‌ద్ర‌త‌కు విఘాతం క‌లిగించే చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వం క‌న్నేసి ఉంచుతుంద‌ని, భ‌ద్ర‌త‌ను కాపాడేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని అరిందం బాగ్చి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు