గుడ్‌న్యూస్‌.. టీకా పంపిణీకి సిద్ధం

6 Jan, 2021 07:59 IST|Sakshi

ప్రభుత్వం తేదీలు ఖరారు చేయాల్సి ఉంది

కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

న్యూఢిల్లీ : కోవిడ్‌–19 టీకా అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చిన 10 రోజుల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నెల 3వ తేదీన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాల అత్యవసర వినియోగానికి డీసీజీఐ(డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్‌ తేదీలను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది. అయితే, ఆరోగ్య శాఖ తాజా ప్రకటన నేపథ్యంలో 13వ తేదీన ముందుగా ప్రకటించిన మూడు కోట్ల మందికి దేశవ్యాప్త వ్యాక్సినేషన్‌ ప్రారంభించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

ఈ విషయమై ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘డ్రైరన్‌ అనుభవం ఆధారంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగానికి అనుమతులు లభించిన 10 రోజుల్లోనే వ్యాక్సినేషన్‌ చేపట్టేందుకు ఆరోగ్య శాఖ సిద్ధమైంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి అంతిమ నిర్ణయం వెలువడాల్సి ఉంది’ అని వివరించారు. వ్యాక్సినేషన్‌ కోసం ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది కొత్తగా రిజిస్టర్‌ చేయించుకోవాల్సిన అవసరం లేదని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. వారి వివరాలు వ్యాక్సిన్‌ పంపిణీ నిర్వహణ కోసం అందుబాటులోకి తెచ్చిన ‘కో–విన్‌’ యాప్‌లో ఇప్పటికే నమోదై ఉన్నాయన్నారు. వ్యాక్సిన్‌ ఇచ్చే సిబ్బంది, వ్యాక్సినేషన్‌ లబ్ధిదారుల కోసం 12 ప్రాంతీయ భాషల్లో సమాచారం వెళుతుందని చెప్పారు.

‘మొదటి విడత లబ్ధిదారుల జాబితాలో ఉన్న వారికి టీకా ఇచ్చే సమయం ఎలక్ట్రానిక్‌ విధానంలో కేటాయింపు జరుగుతుంది. లబ్ధిదారుడి ఫోన్‌కు సమాచారం వెళుతుంది. తర్వాతి డోస్‌ ఎప్పుడు ఇచ్చేదీ అందులోనే ఉంటుంది. టీకా డోసులు పూర్తయితే క్యూఆర్‌ కోడ్‌తో ఎక్నాలెడ్జ్‌మెంట్, యూనిక్‌ హెల్త్‌ ఐడీ కూడా వారికి అందుతుంది. ఇదంతా డిజి లాకర్‌లో ఉచితంగానే భద్రంగా ఉంటుంది’ అని వివరించారు. ఒకవేళ దుష్ప్రభావాలు తలెత్తితే అందుకు సంబంధించిన సమాచారం కో–విన్‌లోనే నమోదవుతుందన్నారు. ఆధార్‌ ధ్రువీకరణ కూడా ఉండటంతో టీకా వినియోగంలో అక్రమాలకు తావే ఉండదన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం దేశీయంగా రూపొందించిన కో–విన్‌ యాప్‌ను కోరితే ఇతర దేశాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.  

ఐసోలేషన్‌లో 71 మంది
దేశవ్యాప్తంగా కోవిడ్‌ వైరస్‌ యూకే వేరియంట్‌ సోకినట్లు గుర్తించిన 71 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ తెలిపారు. యూకే వేరియంట్‌ వ్యాప్తి కారణంగా దేశంలో కొత్తగా ఎటువంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడలేదని ఆయన స్పష్టం చేశారు. గత 24 గంటల్లో భారత్‌లో 16,375 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,56,844కు చేరుకుంది. కోవిడ్‌తో 201 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,49,850 కు పెరిగింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 99,75,958  కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 96.32 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,31,036 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 2.23  శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.45గా ఉంది. ఈ నెల 4 వరకూ 17,65,31,997 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. సోమవారం 8,96,236   పరీక్షలు జరిపినట్లు తెలిపింది. 

మరిన్ని వార్తలు