పదునెక్కిన కరోనా కోరలు

18 Apr, 2021 02:23 IST|Sakshi
వీకెండ్‌ లాక్‌డౌన్‌ సందర్భంగా శనివారం నిర్మానుష్యంగా మారిన ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌

ఒక్కరోజులో 2,34,692 పాజిటివ్‌ కేసులు

24 గంటల్లో 1,341 మంది మృతి

1.45 కోట్లకు చేరిన మొత్తం కేసులు

న్యూఢిల్లీ:  దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. వైరస్‌ వ్యాప్తి మరింత ఉధృతమయ్యింది. వరుసగా మూడో రోజు 2 లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏకంగా 2,34,692 కేసులు బయటపడ్డాయి. ఇండియాలో కేవలం ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే మొదటిసారి.  కరోనా కాటుకు తాజాగా 1,341 మంది బలయ్యారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,45,26,60కు, మొత్తం మరణాల సంఖ్య 1,75,649కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. యాక్టివ్‌ కేసులు వరుసగా 38వ రోజు కూడా పెరిగాయి. ప్రస్తుతం 16,79,740 క్రియాశీల కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో వీటి సంఖ్య 11.56 శాతం. రికవరీ రేటు 87.23 శాతానికి పడింది. ఇండియాలో ఇప్పటిదాకా 1,26,71,220 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. మరణాల రేటు 1.21 శాతంగా నమోదయ్యింది. మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీలో పాజిటివ్‌ కేసులు, మరణాలు అధికంగా నమోదవుతున్నాయి.

ఢిల్లీలో చాలా సీరియస్‌: కేజ్రీవాల్‌
ఢిల్లీలో కరోనా ఉధృతి మరింత పెరిగింది. రాష్ట్రంలో పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని సీఎం కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బాధితుల కోసం ఆక్సిజన్‌ సరిపడా అందుబాటులో లేదని అన్నారు. రెమ్‌డెసివిర్, టోసిలిజుమాబ్‌ తదితర ముఖ్యమైన మందుల కొరత ఉందని అంగీకరించారు. తగినంత ఆక్సిజన్, ఔషధాలు వెంటనే సరఫరా చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌కు విజ్ఞప్తి చేశామని అన్నారు. ఢిల్లీ ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు పడకలు దొరకడం లేదని చెప్పారు. పడకలు ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్‌ ఆసుపత్రులను హెచ్చరించారు.

12.25 కోట్ల టీకా డోసులు పంపిణీ
కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 12,25,02,790 కోవిడ్‌ టీకా డోసులను అర్హులకు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం 92వ రోజుకు చేరిందని, శనివారం ఒక్కరోజే 25.65 లక్షల డోసులు ఇచ్చినట్లు తెలిపింది. 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న వారిలో 4.04 కోట్ల మంది మొదటి డోసు, 10.76 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారని స్పష్టం చేసింది. 60 ఏళ్ల పైబడిన వారిలో 4.55 కోట్ల మంది మొదటి డోసు, 38.77 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారని వివరించింది.

మరిన్ని వార్తలు