ఏడో రోజూ రికవరీలే అధికం

21 May, 2021 06:04 IST|Sakshi

వరుసగా నాలుగో రోజూ 3 లక్షలలోపు కొత్త కేసులు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వరసగా ఏడో రోజూ కొత్త పాజిటివ్‌ కేసుల సంఖ్యతో పోల్చితే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 2,76,110 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,57,72,400కు పెరిగింది. తమిళనాడులో అత్యధికంగా ఒక్క రోజులో 34,875 కేసులు రాగా, కర్ణాటకలో 34,281 నమోదయ్యాయి. మరో సానుకూల పరిణామంగా వరుసగా నాలుగు రోజులుగా కొత్త కేసులు రోజుకు 3 లక్షలలోపే నమోదవుతున్నాయి. దేశంలో మరో 3,69,077 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 2,23,55,440కి పెరిగింది. అయితే గత 24 గంటల్లో దేశంలో కోవిడ్‌ కారణంగా 3,874 మంది మృత్యువాతపడ్డారు. నాలుగు రోజుల తర్వాత తొలిసారిగా దేశంలో కోవిడ్‌తో మరణించి వారి సంఖ్య 4వేల కన్నా తక్కువగా నమోదైంది.

కొత్తగా నమోదైన మరణాల్లో 72.25 శాతం మరణాలు 10 రాష్ట్రాల్లోనే సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య 2,87,122కు చేరింది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 31,29,878కు తగ్గింది. రోగుల రికవరీ రేటు 86.74 శాతం ఉండగా, దేశంలో మరణాల రేటు 1.11 శాతంగా నమోదైంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రకారం గడిచిన 24 గంటల్లో 20,55,010 కోవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. భారత్‌లో ఒక్క రోజులో ఇంత భారీ సంఖ్యలో పరీక్షలు జరగటం ఇదే మొదటిసారి. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 13.44 శాతంగా నమోదైంది. మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభంకావడంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు 18,70,09,792కు చేరాయి.   


ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద దాదాపు రెండు కోట్ల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు ఉన్నాయని, మరో మూడ్రోజుల్లో మరో 26 లక్షల డోసులను సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది.

మరిన్ని వార్తలు