Corona Cases in India: పట్టపగ్గాల్లేకుండా...

25 Apr, 2021 05:42 IST|Sakshi
కరోనా వల్ల మరణించినవారి మృతదేహాలను ఢిల్లీలోని ఓ శ్మశాన వాటికలో దహనం చేస్తున్న దృశ్యం

దేశంలో ఒకేరోజులోనే 3,46,786 పాజిటివ్‌ కేసులు నమోదు

ప్రపంచంలో కొత్త కేసుల్లో 38 శాతం భారత్‌లోనే

అత్యధికంగా 24 గంటల్లో కోలుకున్న 2.19 లక్షల మంది రోగులు

సాక్షి , న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి పట్టపగ్గాలేకుండా విజృంభిస్తోంది. వైరస్‌ సంక్రమణ రోజుకొక కొత్త రికార్డును అధిగమిస్తోంది. దేశంలో వరుసగా మూడవ రోజు మూడు లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం శుక్రవారం భారత్‌లో రికార్డు స్థాయిలో 3,46,786 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో మరేదేశంలోనూ లేనంతగా ఒకేరోజు (బుధవారం) 3.14 లక్షల అత్యధిక కేసులతో రికార్డులకెక్కిన భారత్‌ వరుసగా మూడోరోజూ ఈ పరంపరను కొనసాగించింది. దీనితో భారతదేశంలో మూడు రోజుల్లోనే 9.94 లక్షల కొత్త కేసులు వచ్చాయి.

ప్రపంచంలో 24 గంటల్లో మొత్తం 8.9 లక్షల కేసులు నమోదుకాగా, అందులో 38 శాతం భారతదేశానికి చెందినవి. మొదటిసారిగా ఒక్కరోజులో 2,19,838 మంది ప్రజలు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచంలో ఒకదేశంలో ఒకరోజులో ఇంత మంది కోలుకోవడం కూడా ఇదే అత్యధికం కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా 2,624 మంది మృత్యువాతపడ్డారు. 24 గంటల్లో కరోనా కారణంగా సంభవించిన మరణాల్లో ఇది కొత్త రికార్డు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 25 లక్షలు దాటింది.

బెంగళూరులో కరోనా ప్రకోపం
దేశంలోని అన్ని నగరాల కంటే ఎక్కువగా, బెంగళూరులో అత్యధికంగా 1.5 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పుణేలో 1.2 లక్షలు యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో శుక్రవారం 66,836 కేసులు నమోదయ్యాయి. ఇది దేశంలోనే అత్యధికం. దీని తరువాత ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 14,08,02,794 కరోనా టీకా డోసులను అర్హులకు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. కేవలం 99 రోజుల్లోనే 14 కోట్లకు పైగా డోసులు ఇచ్చినట్లు పేర్కొంది.

భారత విమానాలపై కువైట్‌ నిషేధం
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే విమానాలపై కువైట్‌ తాజాగా నిషేధం విధించింది. శనివారం నుంచి అమలులోకి వచ్చి ఈ నిషేధాజ్ఞలు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమలులో ఉంటాయని తెలిపింది. మరోవైపు ఇరాన్‌ కూడా భారత్, పాకిస్తాన్‌ నుంచి వచ్చే విమానాలను అనుమతించబోమని ప్రకటించింది. 

మరిన్ని వార్తలు