24 లక్షలు దాటిన కరోనా కేసులు

15 Aug, 2020 03:16 IST|Sakshi

పెరిగిన రికవరీ రేటు.. తగ్గిన మరణాల రేటు

రోజుకు 10 లక్షల టెస్టులు లక్ష్యం: కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 64,553 కేసులు బయట పడటంతో మొత్తం కేసుల సంఖ్య 24,61,190 కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,007 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 48,040 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 16,95,982కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,61,595 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 26.88 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 71.17 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

మరణాల రేటు 1.95 శాతానికి పడిపోయిందని తెలిపింది. తాజా 1,007 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 413 మంది మరణించారు.  ఆగస్టు 13 వరకు 2,76,94,416 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. గురువారం రికార్డు స్థాయిలో 8,48,728 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. రోజుకు 10 లక్షల పరీక్షలు చేయడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది. మొత్తం 1,433 ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది. దేశంలో ప్రతి మిలియన్‌ మందికి రోజుకు 603 మందికి పరీక్షలు జరుగుతుండగా  అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో  2,822 మందికి పరీక్షలు చేస్తున్నారు.

కోలుకున్న అమిత్‌షా
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈనెల 2న ఆయనకు కరోనా పాజిటివ్‌ రాగా గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిపిన పరీక్షల్లో తనకు నెగెటివ్‌ వచ్చిందని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ‘దేవుడికి ధన్యవాదాలు. నేను కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నా కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. డాక్టర్ల సూచన మేరకు కొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండబోతున్నాను’అని షా వెల్లడించారు.  

లవ్‌ అగర్వాల్‌కు కరోనా
కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌కు కరోనా సోకింది.  శుక్రవారం ఈ విషయం ఆయన ట్విట్టర్లో వెల్లడించారు.  దేశంలో కోవిడ్‌–19 వ్యాప్తిపై ఆయన కేంద్రం తరఫున ఏప్రిల్, మే నెలల్లో ప్రతి రోజూ మీడియాకు వివరాలను వెల్లడించారు. ‘నాకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. మార్గదర్శకాల ప్రకారం హోం ఐసోలేషన్‌కు వెళుతున్నాను.  త్వరలోనే మిమ్మల్ని అందరినీ కలుస్తానని ఆశిస్తున్నాను’అని లవ్‌ అగర్వాల్‌ ట్వీట్‌ చేశారు. 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు