గడిచిన 24 గంటల్లో 66,732 కేసులు

12 Oct, 2020 10:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 71 లక్షల పై చిలుకు మార్కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 66,732 కొత్త కేసులు నమోదు కాగా.. 816 మంది వైరస్‌ బారిన పడి మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక నేడు సంభవించిన మరణాల్లో 84 శాతం పది రాష్ట్రాల నుంచి నమోదయ్యాయి. కోవిడ్‌ మరణాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 308 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 71, 20,539 కోవిడ్‌ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 61,49,536 మంది కోలుకోగా.. ప్రస్తుతం 8,61,853 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడి 1,09,150 మంది మృత్యువాత పడ్డారు. (చదవండి: 10 వేల పల్లెలపై కరోనా పడగ)

కరోనావైరస్ కేసులు 21 రోజుల్లో 10 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగాయి. 30 లక్షలు దాటడానికి 16 రోజులు, 40 లక్షలను దాటడానికి 13 రోజులు, 50 లక్షలు దాటడానికి 11 రోజులు పట్టింది. ఇక ఈ కేసులు 12 రోజుల్లో 50 లక్షల నుంచి 60 లక్షలకు పెరిగాయి. దేశంలో కోవిడ్ -19 కేసులు లక్షకు చేరుకోవడానికి 110 రోజులు పట్టింది.. కానీ 10 లక్షల మార్కును దాటడానికి 59 రోజులు మాత్రమే పట్టడం గమనార్హం. ఇక దేశవ్యాప్తంగా కోవిడ్‌ మరణాల రేటు (సీఎఫ్ఆర్) 1.54 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకారం, అక్టోబర్ 10 వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 8,68,77,242 నమూనాలను పరీక్షించగా.., శనివారం 10,78,544 టెస్ట్‌లు పరీక్షించారు.

మరిన్ని వార్తలు