బాబోయ్‌... 4 లక్షలూ దాటేశాం

2 May, 2021 02:06 IST|Sakshi
ఢిల్లీలోని రకాబ్‌గంజ్‌ సాహిబ్‌ గురుద్వారాలో ఏర్పాటైన కోవిడ్‌ సెంటర్‌

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సృష్టిస్తున్న తీవ్ర కలకలంతో దేశంలో పరిస్థితులు రోజురోజుకీ అదుపు తప్పుతున్నాయి. కరోనా సంక్రమణ కేసులు రిక్డార్డు స్థాయిలో నమోదవుతున్న తీరు, మరణాల సంఖ్యలో పెరుగుదల ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రోగులు పెరుగుతున్న కారణంగా ఆరోగ్య వ్యవస్థ అతలాకుతలమవుతోంది. వరుసగా 9 రోజులపాటు 3 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదైన మన దేశంలో గత 24 గంటల్లో 4 లక్షల కంటే అధికంగా సంక్రమణ కేసులను గుర్తించారు. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 4,01,993 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అత్యధికంగా మహారాష్ట్రలో 62,919, కర్ణాటకలో 48,296 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. గత కొద్దిరోజులగా ప్రపంచంలో ఏ దేశంలోని రానన్ని (ఒకేరోజు) అత్యధిక కేసులు భారత్‌లో వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒకేరోజు కొత్త కేసుల సంఖ్య ఏకంగా నాలుగు లక్షలు దాటేసింది. ఈ సంఖ్య కరోనా ఎక్కువగా సోకిన అమెరికాలో శుక్రవారం నమోదైన కేసుల కంటే ఏడురెట్లు ఎక్కువ. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం గుర్తించిన 8.66 లక్షల మంది కొత్త రోగుల్లో దాదాపు సగం (46%) పాజిటివ్‌ కేసులు భారతదేశంలోనే గుర్తించారు. దీంతో ప్రస్తుతం దేశంలో వైరస్‌ సోకిన వారి మొత్తం సంఖ్య 1,91,64,969కు చేరుకుంది.  

దేశంలో కరోనాతో మరణించే వారి సంఖ్య సైతం ప్రతీరోజు పెరుగుతోంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా దేశంలో 3,523 మంది తుదిశ్వాస విడిచారు. దీంతో కరోనా వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 2,11,853 కు చేరుకుంది. అంటే, ప్రపంచంలో గత 24 గంటల్లో సంభవించిన ప్రతి నాలుగు కరోనా మరణాల్లో ఒకటి భారత్‌లో నమోదైంది. ప్రస్తుతం దేశంలో 32,68,710 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అమెరికా తరువాత భారతదేశంలోనే అత్యధిక యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  

కోలుకున్న వారు 3 లక్షలు! 
అయితే గత 24 గంటల్లో 2,99,988 మంది కరోనా రోగులు చికిత్స తీసుకొని కోలుకోవడం  గమనార్హం. ప్రతీరోజూ నమోదవుతున్న కరోనా కొత్త కేసులతో పోలిస్తే కోలుకుంటున్న రోగుల సంఖ్య తక్కువగానే ఉంటోంది. అయితే దేశంలో  ప్రస్తుతం రికవరీ రేటు 81.84%గా నమోదైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19.45 లక్షల కరోనా టెస్టులు నిర్వహించగా 4,01,993 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంటే 20.66%  పాజిటివిటీ రేటు ఉంది. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 15,49,89,635 వ్యాక్సిన్‌ డోస్‌లు వేశారు.  

మరిన్ని వార్తలు