16 లక్షలు దాటేశాయ్‌

1 Aug, 2020 02:42 IST|Sakshi
శుక్రవారం కోల్‌కతాలో ఓ హోటల్‌లోని జిమ్‌ను శానిటైజ్‌ చేస్తున్న కార్మికుడు

ఒక్కరోజులో రికార్డ్‌ స్థాయిలో 55,078 పాజిటివ్‌ కేసులు 

కొత్తగా 779 మంది బాధితుల మృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా,  పాజిటివ్‌ కేసులు, కేంద్ర ఆరోగ్య శాఖ16 లక్షలు దాటాయి. కేవలం 21 రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యాయి.  గత 24 గంటల్లో కొత్తగా 55,078 కేసులు బయటపడ్డాయి.  తాజాగా 779 మంది కరోనా బాధితులు మరణించారు. భారత్‌లో మొత్తం            పాజిటివ్‌ కేసులు 16,38,870కి, మరణాలు 35,747కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు 10,57,805 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. ప్రస్తుతం 5,45,318 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 64.54 శాతం కాగా మరణాల రేటు 2.18 శాతంగా ఉంది.

10 నుంచి ఢిల్లీ వర్సిటీ విద్యా సంవత్సరం
2020–21 విద్యా సంవత్సరాన్ని ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రకటించింది. అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహిస్తామని వెల్లడించింది. ఆగస్టు 9 వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. చివరి సంవత్సరం విద్యార్థులకు ఆగస్టు 10 నుంచి ఆన్‌లైన్‌ ఓపెన్‌ బుక్‌ పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేసింది.

హోటళ్లు, సంతలు ఇప్పుడే వద్దు: అన్‌లాక్‌–3 కింద హోటళ్లు, వారాంతపు సంతలు నిర్వహించుకునేందుకు అనుమతించాలన్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌  తిరస్కరించారు. దేశ రాజధానిలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టలేదని, హోటళ్లు, సంతలు ఇప్పుడే ప్రారంభించడం సరైంది కాదని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ భావిస్తున్నట్లు అధికారులు చెప్పారు.     

వైద్యులకు సకాలంలో జీతాలివ్వండి
కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందంజలో నిలుస్తున్న వైద్యులకు, ఆరోగ్య కార్యకర్తలకు కొన్ని రాష్ట్రాల్లో సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమ ఆదేశాలను పాటించకపోవడం ఏమిటని ప్రశ్నించింది.  ఏమాత్రం ఆలస్యం లేకుండా వైద్యులకు   సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
 

మరిన్ని వార్తలు