భారత్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కారణం ఇదే!

4 Mar, 2023 20:17 IST|Sakshi

ఢిల్లీ: కరోనా మహమ్మారి పీడ ముగిసిపోయిందనుకునేలోపే మరోసారి పంజా విసురుతోందా?. తాజాగా భారత్‌లో మళ్లీ కోవిడ్‌ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.  ఇండియాలో 97 రోజుల తర్వాత 300కి పైగా తాజా కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసులు 2,686కిపైగా పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.

దేశంలో ఒకే రోజు 334 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. గత 24 గంటల్లో మహారాష్ట్రలో ఇద్దరు, కేరళలో ఒకరు వైరస్‌ బారిన పడి మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 5,30,775కి పెరిగింది.

దేశంలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య 4.46 కోట్లు, కాగా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, ఇప్పుడు యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 0.00 శాతం ఉన్నాయి. అయితే జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,41,54,035కి పెరిగింది, అయితే మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220.63 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ జరిగింది.

కాగా, మళ్లీ కరోనా కేసులు పెరగడానికి నిర్లక్ష్యమే కారణమా?. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు తప్పనిసరిగ్గా ధరించాలని నిపుణులు చెబుతున్నా కానీ, మాస్క్‌లు పెట్టుకోకుండా ‍ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. రైల్వేస్టేషన్లు, బస్‌ స్టేషన్లలో మార్కెట్లుల్లో కూడా చాలా మంది మాస్క్‌లు  ధరించడం లేదు.

చైనా, అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌తో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో  రద్దీ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని, కొవిడ్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసును అర్హులైన అందరూ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. కొవిడ్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చదవండి: జీవితంలో సుడిగుండం.. మానసిక శక్తిని దెబ్బతీసిన కరోనా

మరిన్ని వార్తలు