పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం

18 May, 2021 04:58 IST|Sakshi

26 రోజుల తరువాత 3 లక్షలకు దిగువన కరోనా పాజిటివ్‌ కేసులు

గత 24 గంటల్లో 2,81,386 పాజిటివ్‌ కేసులు నమోదు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వేగం కాస్త నెమ్మదించినట్లుగా కనిపిస్తోంది. గత వారంలో మే 10 నుంచి 16 వరకు 23.02 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులను దేశవ్యాప్తంగా గుర్తించారు. ఈ సంఖ్య గత 3 వారాల్లో అతి తక్కువ. అంతకుముందు మే 3 నుంచి మే 9వ తేదీ మధ్య 27.42 లక్షల పాజిటివ్‌ కేసులను గుర్తించారు. అయితే మరణాల సంఖ్యలో మాత్రం మార్పు ఏమాత్రం కనిపించట్లేదు. గత వారం కరోనా కారణంగా దేశంలో 28,266 మంది మరణించారు. అంతేగాక ఈ మరణాల సంఖ్య ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అత్యధికం. సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 2,81,386 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

గత 26 రోజుల్లో ఒకే రోజులో 3 లక్షల కన్నా తక్కువ పాజటివ్‌ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అంతకుముందు ఏప్రిల్‌ 20న 2.94 లక్షల కరోనా కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసుల్లో 75.95% శాతం కేసులు కేవలం పది రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 34,389 కేసులు, తమిళనాడులో 33,181, కర్ణాటకలో 31,531, కేరళలో 29,704, ఆంధ్రప్రదేశ్‌లో 24,171 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 31కోట్ల 64లక్షల 23వేల 658 కరోనా టెస్ట్‌లను నిర్వహించగా అందులో ఆదివారం 15లక్షల 73వేల 515 పరీక్షలు చేశారు. అంటే గత 24 గంటల్లో దేశంలో నమోదైన పాజిటివిటీ రేటు 17.88%గా నమోదైంది. దేశంలో 479 జిల్లాల్లో 10% కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉండగా, 244 జిల్లాల్లో 20% కంటే ఎక్కువ ఉంది.

మరిన్ని వార్తలు