అంతర్గత విషయాల్లో జోక్యం వద్దు: చైనాకు హితవు

6 Aug, 2020 12:33 IST|Sakshi

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ అంశంలో పదే పదే తలదూర్చాలని ప్రయత్నిస్తున్న చైనాకు భారత్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికింది. ఇప్పటికే అనేకసార్లు ఇలాంటి ప్రయత్నాలు చేసి భంగపడిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ మేరకు.. ‘‘భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌ గురించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో చర్చను లేవనెత్తేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాల గురించి మా దృష్టికి వచ్చింది. పూర్తిగా భారత అంతర్గత విషయమైన కశ్మీర్‌ అంశంలో చైనా ఇలాంటి చర్చను కోరడం ఇదే తొలిసారి కాదు. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా అంతర్జాతీయ సమాజం నుంచి అవే అనుభవాలు ఎదురవుతాయి. ఇలాంటి అనవసర ప్రయత్నాలు మానుకోవాలి. మా అంతర్గత విషయాల్లో చైనా జోక్యాన్ని ఖండిస్తున్నాం’’అని విదేశాంగ శాఖ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.(చైనా దూకుడుకు కళ్లెం వేయాలంటే: అమెరికా)

కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసిన నాటి నుంచి దాయాది దేశం పాకిస్తాన్‌.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కశ్మీర్‌ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరుతూ గతంలో లేఖ రాసింది. అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో పాక్‌ మిత్రదేశం చైనా కశ్మీర్‌ అంశంపై ఐరాసలో రహస్య సమావేశం నిర్వహించింది. అయితే కశ్మీర్‌ తమ అంతర్గత విషయమని భారత్‌ ఇదివరకే పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేయడంతో.. ఐరాసలో శాశ్వత సభ్య దేశాలైన ఫ్రాన్స్‌, రష్యా, అమెరికా, బ్రిటన్‌లు భారత్‌ను సమర్థించగా.. కేవలం చైనా మాత్రమే పాక్‌కు పరోక్షంగా మద్దతు తెలుపుతోంది. ఇక కేంద్రం తాజా ప్రకటన నేపథ్యంలో ఆర్టికల్‌ 370 రద్దుకు నిన్నటి(ఆగష్టు 5)తో ఏడాది పూర్తైన సందర్భంగా మరోసారి భారత్‌పై విషం కక్కిన పాకిస్తాన్‌.. చైనాతో కలిసి కుట్రలు పన్నుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

>
మరిన్ని వార్తలు