కోవిడ్‌ మరణాల్లో మరో రికార్డు

13 May, 2021 05:20 IST|Sakshi
కోవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన చిన్నారిని ఢిల్లీలో ఖననం చేసేందుకు తీసుకెళ్తున్న దృశ్యం

ప్రపంచంలో గత 24 గంటల్లో నమోదైన మరణాల్లో 47.7% భారత్‌లోనే

దేశంలో 2.5 లక్షలు దాటిన మరణాల సంఖ్య

ఒక్కరోజులో అత్యధికంగా 4,205 మంది మృతి

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌తో ప్రాణాలుపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,48,421 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,33,40,938 కు పెరిగింది. దేశంలో ఒక్కరోజులోనే ఏకంగా 4,205 మంది కోవిడ్‌తో మరణించారు. దీంతో కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య 2,54,197కు చేరింది. అదే సమయంలో దేశంలో  గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 3,55,338 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,93,82,642కు పెరిగింది.

రికవరీ రేటు సైతం 83.04 శాతానికి పెరిగింది. రోజువారీ కొత్త కేసులతో పోలిస్తే రోజువారీగా రికవరీ అయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. వరసగా రెండో రోజూ ఇలా రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 37,04,099కు చేరింది.  గత 24 గంటల్లో దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 40,956 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు, 793 కోవిడ్‌ బాధితుల మరణాలు నమోదయ్యాయి. భారతదేశంలో కరోనా కారణంగా సంభవించిన మరణాలు 2.5 లక్షలను దాటాయి. అయితే మరణాల విషయంలో అమెరికా, బ్రెజిల్‌లు భారత్‌ కంటే ముందంజలో ఉన్నాయి.

అమెరికాలో మరణాల రేటు 1.8 శాతంకాగా, బ్రెజిల్‌లో 2.7 శాతంగా, దక్షిణాఫ్రికాలో 3.4 శాతంగా ఉంది. ఇక భారత్‌లో జాతీయ మరణాల రేటు 1.09 శాతంగా నమోదైంది. ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన కరోనా మరణాల్లో అమెరికాలో 18 శాతం, బ్రెజిల్‌లో 12.8%, భారత్‌లో 7.6% నమోదయ్యాయి. అక్టోబర్‌లో ప్రారంభమైన కరోనా థర్డ్‌ వేవ్‌ వ్యాప్తిని అమెరికా ఇప్పటికీ ఎదుర్కొంటోంది. మే 11న అమెరికాలో 693 మంది, బ్రెజిల్‌లో 2311 మంది, మెక్సికోలో 234 మంది కోవిడ్‌తో మరణించారు. కానీ అదే సమయంలో భారత్‌లో 4,205మంది మృత్యువాత పడ్డారు. అంటే మే 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్యలో 47.72% మరణాలు భారత్‌లోనే నమోదయ్యాయి. అమెరికాలో కరోనా ఫస్ట్‌ వేవ్‌లో ఒకేరోజులో అత్యధికంగా 2759 మంది ప్రాణాలు కోల్పోయారు.

>
మరిన్ని వార్తలు