కరోనా కొత్త కేసులు 46,164

27 Aug, 2021 06:12 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల్లో మరో 46,164 కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు కేంద్రం గురువారం వెల్లడించింది. దీంతో, మొత్తం కేసులు 3,25,58,530కు చేరుకున్నాయని వెల్లడించింది. అదే సమయంలో, 607 మంది కరోనా బాధితులు మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 4,36,365కు పెరిగిందని తెలిపింది. యాక్టివ్‌ కేసులు కూడా 3,33,725కు పెరిగాయని, మొత్తం కేసుల్లో ఇవి 1.03%గా ఉన్నాయని పేర్కొంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 97.63%గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 51,31,29,378 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపట్టినట్లు తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.58% కాగా, ఇది గడిచిన 31 రోజులుగా మారలేదని వెల్లడించింది. అదేవిధంగా, వీక్లీ పాజిటివిటీ రేటు గత 62 రోజులుగా ఎలాంటి మార్పులేకుండా 2.02%గానే ఉంటోందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 60.38 కోట్ల కోవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.

కేరళలో ప్రమాదఘంటికలు
కేరళలో కరోనా తీవ్రత ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో బుధవారం 31,445 కేసులు, గురువారం 30,007 కేసులు నిర్ధారణయ్యాయి. దేశంలో తాజాగా నమోదైన కేసుల్లో 66% ఒక్క కేరళ నుంచే ఉన్నాయి. దేశవ్యాప్తంగా గతవారం నమోదైన మొత్తం కేసుల్లో కేరళలోనివే 58.4% ఉన్నాయి. దీంతో, గురువారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఆ రాష్ట్ర అధికారులతో మీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష చేపట్టారు. వైరస్‌ వ్యాప్తి, కరోనా కట్టడికి అమలు చేయాల్సిన వ్యూహం, మౌలిక వసతులపై చర్చించి, అవసరమైన సూచనలు చేసినట్లు హోం శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన కేరళను సందర్శించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ రాష్ట్రంలో ఆరోగ్య వసతుల మెరుగుకు రూ.267 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్‌లో 20 కోట్ల కోవిషీల్డ్‌ టీకా డోసుల సరఫరా
వచ్చే సెప్టెంబర్‌లో 20 కోట్ల డోసుల కోవిషీల్డ్‌ టీకాలను సరఫరా  చేయనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) గురువారం కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశంలోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఎస్‌ఐఐ ఆగస్టులో 12 కోట్ల డోసుల కోవిడ్‌ టీకా అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పెరిగిన ఉత్పత్తి సామర్థ్యంతో సెప్టెంబర్‌ నెలలో సంస్థ 20 కోట్ల డోసుల టీకాలను సరఫరా చేయగలదని సంస్థ రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు