ఒక్క రోజులోనే 53 వేలు

26 Mar, 2021 03:51 IST|Sakshi
జలంధర్‌లో మహిళకు కరోనా పరీక్ష చేస్తున్న వైద్య సిబ్బంది

ఈ ఏడాదిలో అత్యధిక కోవిడ్‌ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి తీవ్రతరమవుతోంది. 24 గంటల్లోనే 53,476 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇది ఈ ఏడాదిలోనే అత్యధికం. దీంతోపాటు, గత రెండు రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య లక్ష దాటిపోవడం ఆందోళన కలిగించే అంశం. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు 1,17,87,534కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. కొత్తగా నిర్థారణ అయిన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 31,855, పంజాబ్‌లో 2,613, కేరళలో 2,456 ఉన్నాయి. అదేవిధంగా, యాక్టివ్‌ కేసులు వరుసగా 15వ రోజు కూడా పెరిగి, 3,95,192కు చేరుకుని, మొత్తం కేసుల్లో ఇవి 3.95%గా ఉన్నాయి. రికవరీ రేటు మరింత తగ్గి 95.28%గా ఉందని కేంద్రం తెలిపింది. మహమ్మారితో ఒక్క రోజులోనే మరో 251 మంది మరణించడంతో ఇప్పటి వరకు 1,60,692 మంది చనిపోయినట్లయింది. గత ఏడాది అక్టోబర్‌ 23వ తేదీన 54,366 కేసులు నమోదైన రికార్డు ఉంది. ఈ వ్యాధి బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,12,31,650కి చేరింది.

ఆ రాష్ట్రాల్లో ఎక్కువ
రోజువారీ కరోనా కేసులు మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, చత్తీస్‌గఢ్, గుజరాత్‌లలోనే ఎక్కువగా బయటపడుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో ఈ రాష్ట్రాల్లోనే 80.63%వరకు ఉన్నాయని వెల్లడించింది. యాక్టివ్‌ కేసులు కూడా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లలోనే 74.32%వరకు ఉన్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో 35,952 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 26,00,833కు పెరిగింది.
 

మరిన్ని వార్తలు