దడ పుట్టిస్తున్న కరోనా.. 7 నెలల గరిష్టానికి కొత్త కేసులు.. మరో 7,830 మందికి పాజిటివ్..

12 Apr, 2023 11:21 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,830 మందికి పాజిటివ్‌గా తేలింది. గత ఏడు నెలల్లో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. క్రితం రోజుతో(5,676 కేసులు) పోల్చితే దాదాపు 50 శాతం అధికం.

కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 40వేల మార్క్ దాటి 40,215కు చేరింది. కరోనావ్యాప్తి మొదలైనప్పటి నుంచి వైరస్ బారినపడివారిలో 4,42,04,771 మంది కోలుకున్నారు. కోవిడ్ సోకి ఇప్పటివరకు మొత్తం 5,31,016 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త తెలిపారు. వైరస్ వివిధ రకాలుగా మ్యుటేషన్లు చెంది బలహీనపడుతోందని చెప్పారు. అందుకే పాజిటివ్‌గా తేలిన వారిలో స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా రావడం లేదని పేర్కొన్నారు. అయితే ప్రజలు కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. బూస్టర్ డోసు తీసుకోనివారు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని సూచించారు.
చదవండి: కోవిడ్‌ అంతమయ్యే అవకాశముంది.. అయినా సరే నిర్లక్ష్యం వద్దు.. బూస్టర్‌ డోసు తీసుకోవాల్సిందే

మరిన్ని వార్తలు