కరోనా డేంజర్‌ బెల్స్‌: 50 వేలకు చేరువలో యాక్టివ్‌ కేసులు

13 Jun, 2022 11:01 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యేలా కనిపించడం లేదు. కరోనాను జనం తేలిగ్గా తీసుకుంటుండంతో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. జూలైలో కేసులు పీక్స్‌కు చేరనున్నట్లు, మరో ఆరు నెలలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని చెబుతున్నారు. భారత్‌లో కేసుల నమోదు చూస్తుంటే కోవిడ్‌ నాలుగో వేవ్‌ దగ్గరికి వచ్చినట్లే కనిపిస్తోంది.

గడిచిన 24 గంటల్లో  దేశంలో 8,084 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,32,30,101కు చేరాయి. ఒక్క రోజే 10 మంది మరణించడంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,24,771కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 50 వేలకు చేరువగా ఉన్నాయి. ప్రస్తుతం 47,995 యాక్టివ్‌ కేసులున్నాయి. నిన్న 4,592 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు సోమవారం హెల్త్ బులిటెన్‌ విడుదల చేశారు.

దీని ప్రకారం కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 2946 కేసులు ఉన్నాయి. కేరళలో 4319, ఢిల్లీలో 735, కర్ణాటకలో 463, హర్యానాలో 304 నమోదయ్యాయి.ఇక యాక్టివ్‌ కేసులు 0.11 శాతానికి చేరాయి. రికవరీ రేటు 98.68 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతానికి చేరింది. ఇప్పటివరకు 1,95,19,81,150 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపింణీ చేశామని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 11,77,146 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొంది.
చదవండి: పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలు వెంటాడుతున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..

మరిన్ని వార్తలు