COVID-19: అక్టోబర్‌ 11 తర్వాత మళ్లీ...

30 Mar, 2021 05:12 IST|Sakshi
ముంబైలోని దాదర్‌ బీచ్‌లో కోవిడ్‌ ఆంక్షలను అమలుచేస్తున్న పోలీసులు

68,020 కొత్త కరోనా కేసులు

ఒకరోజులో ఇదే అత్యధికం

న్యూఢిల్లీ/డెహ్రాడూన్‌: దాదాపు నెల రోజుల నుంచి కరోనా బెంబేలెత్తిస్తోంది. క్రమంగా కేసులు పెరుగుతూ ఉండగా, డబులింగ్‌ టైమ్‌ తగ్గుతూ వస్తోంది. దేశంలో గత 24 గంటల్లో ఏకంగా 68,020 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గతేడాది అక్టోబర్‌ 11 తర్వాత.. ఒకరోజు వ్యవధిలో నమోదైన అధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,20,39,644కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

అదే సమయంలో కరోనా కారణంగా 291 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,61,843 కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,13,55,993కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 94.32 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య   5,21,808గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 4.33   శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.34గా ఉంది. ఇప్పటివరకూ వరకూ 24,18,64,161 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఆదివారం 9,13,319 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది.

8 రాష్ట్రాల్లో..
దేశంలో సోమవారం నమోదైన కేసుల్లో 84.5శాతం కేసులు కేవలం 8 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇందులో మహారాష్ట్రలో 40,414, కర్ణాటకలో 3,082, పంజాబ్‌లో 2,870, మధ్యప్రదేశ్‌లో 2,276 గుజరాత్‌లో 2,270, కేరళలో 2,216, తమిళనాడులో 2,194, ఛత్తీస్‌గఢ్‌లో 2,153 కేసులు నమోదయ్యాయి. కేవలం మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, కేరళ రాష్ట్రాల్లోనే 80.17శాతం యాక్టివ్‌ కేసులున్నాయి. మరోవైపు 10 రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకూ 6.05 కోట్ల కోవిడ్‌ డోసుల వ్యాక్సినేషన్‌ జరిగింది.  

రిషికేశ్‌ తాజ్‌ హోటల్‌లో 76 మందికి కరోనా
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం రిషికేశ్‌లోని తాజ్‌ హోటల్‌లో ఏకంగా 76 మందికి కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేపింది. దీంతో మూడు రోజుల పాటు హోటల్‌ను మూసేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ముందుజాగ్రత్తల్లో భాగంగా హోటల్‌ను పూర్తి స్థాయిలో శానిటైజ్‌ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గతవారంలోనే 16 కేసులు రావడంతో 48 గంటల పాటు హోటల్‌ను మూసేశారు. తాజా కేసులతో మూడు రోజుల పాటు మూసివేశారు.

దీంతో పాటు ఇటీవల డెహ్రాడూన్‌లోని నెహ్రూ కాలనీ, రిషికేశ్‌లోని గుమనివాలా ప్రాంతాలను అధికారులు కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించి పూర్తి స్థాయి నిబంధనలు విధించిన నేపథ్యంలో తాజా కేసులు బయట పడటంతో ఈ ప్రాంతాల్లోని బ్యాంకులు, షాపులు, ఆఫీసులను కూడా మూసేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇంట్లోకి అవసరమైన నిత్యావసరాలను కొనేందుకు కూడా కేవలం ఇంటికొకరే బయటకు రావాల్సిందిగా అధికారులు సూచించారు. హరిద్వార్‌లో తాజాగా 73 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.  

మరిన్ని వార్తలు