దేశంలో కరోనా మరణ మృదంగం

19 Apr, 2021 04:44 IST|Sakshi
దేశ రాజధాని ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో కోవిడ్‌ మృతులకు దహనసంస్కారాలు

ఒక్కరోజులో 1,501 మరణాలు.. 2,61,500  పాజిటివ్‌ కేసులు

1,77,150కి చేరిన మొత్తం మరణాలు

ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్‌ కేసులు 1,47,88,109

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. వరుసగా నాలుగో రోజు 2 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక్కరోజులో ఏకంగా 2,61,500 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. కరోనా వైరస్‌ మరణ శాసనం రాస్తోంది. మరో 1,501 మందిని బలితీసుకుంది. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,47,88,109కు, మరణాల సంఖ్య 1,77,150కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

మరోవైపు క్రియాశీల(యాక్టివ్‌) కరోనా కేసులు వరుసగా 39వ రోజు కూడా పెరిగాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 18,01,316కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 12.18 శాతం ఉన్నాయి.  ఇక రికవరీ రేటు 86.62 శాతానికి పడిపోయిందని ఆరోగ్య శాఖ తెలియజేసింది. దేశంలో కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 1,28,09,643 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా సంబంధిత మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు గత ఏడాది ఆగస్టు 7న 20 లక్షల మార్కును, ఆగస్టు 23న 30 లక్షల మార్కును, సెప్టెంబర్‌ 5న 40 లక్షల మార్కును, సెప్టెంబర్‌ 16న 50 లక్షల మార్కును, నవంబర్‌ 20న 90 లక్షల మార్కును, డిసెంబర్‌ 19న కోటి మార్కును దాటేశాయి.

భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) గణాంకాల ప్రకారం.. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 17 వరకూ 26,65,38,416 నమూనాలను పరీక్షించారు. శనివారం ఒక్కరోజే 15,66,394 నమూనాలను పరీక్షించారు. దేశంలో కరోనా వల్ల 1,77,150 మంది మరణించగా, వీరిలో 59,970 మంది మహారాష్ట్రలో, 13,270 మంది కర్ణాటకలో, 13,071 మంది తమిళనాడులో, 11,960 మంది ఢిల్లీలో, 10,540 మంది పశ్చిమ బెంగాల్‌లో, 9,703 మంది ఉత్తరప్రదేశ్‌లో, 7,834 మంది పంజాబ్‌లో కన్నుమూశారు. భారత్‌లో కరోనా బారినపడి మృతిచెందిన వారిలో 70 శాతం మందికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.  

162 పీఎస్‌ఏ ప్లాంట్లు మంజూరు
దేశంలో కోవిడ్‌–19 మహమ్మారి ఉధృతి నేపథ్యంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రజారోగ్య కేంద్రాల్లో 162 ప్రెజర్‌ స్వింగ్‌ అడ్‌సార్‌ప్షన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లను నెలకొల్పేందుకు అంగీ కారం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది.  ఈ ప్లాంట్ల ద్వారా ఆసుపత్రులు తమకు అవసరమైన మెడికల్‌ ఆక్సిజన్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. తద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేసే నేషనల్‌ గ్రిడ్‌పై భారం తగ్గిపోతుంది. మొత్తం 162 పీఎస్‌ఏ ప్లాంట్లను కేంద్రం మంజూరు చేసింది.

అన్ని రాష్ట్రాల్లో వీటిని ఏర్పాట్లు చేస్తారు. వీటితో మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం 154.19 మిలియన్‌ టన్నులకు చేరుకుంటుంది. ఇప్పటికే 33 పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయ్యింది. మధ్యప్రదేశ్‌లో 5, హిమాచల్‌ ప్రదేశ్‌లో 4, చండీగఢ్‌లో 3, గుజరాత్‌లో 3, ఉత్తరాఖండ్‌లో 3, బిహార్‌లో 2, కర్ణాటకలో 2, తెలం గాణలో రెండు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, హరియాణా, కేరళ, మహా రాష్ట్ర, పుదుచ్చేరి, పంజాబ్, యూపీరాష్ట్రాల్లో ఒక్కో టి చొప్పున నెలకొల్పుతున్నారు. దేశంలో ఏప్రిల్‌ ఆఖరుకల్లా మరో 55, మే చివరికిమరో 80 పీఎస్‌ఏ పాంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 162 పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటుకయ్యే రూ.201.58 కోట్ల భారాన్ని కేంద్రమే భరిస్తోంది.  

ఇక ఆక్సిజన్‌ రైళ్లు
దేశంలో కోవిడ్‌–19 ఉధృతరూపం దాల్చడంతో ఆక్సిజన్‌ సిలండర్లకి డిమాండ్‌ బాగా పెరిగింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్‌కి కొరత ఏర్పడడంతో లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా చేయడానికి రైల్వే శాఖ సిద్ధమైంది. ముంబైకి సమీపంలోని కలంబొలి, బోయిసార్‌ స్టేషన్ల నుంచి ఖాళీ ట్యాంకర్లు తీసుకొని ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు సోమవారం తన ప్రయాణం ప్రారంభిస్తాయి. వైజాగ్, జంషెడ్‌పూర్, రూర్కెలా, బొకారోలలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ను నింపుకొని అవసరమైన ప్రాంతాలకు తరలిస్తామని రైల్వే మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఆదివారం వెల్లడించారు.

పరిశ్రమలకు ఆక్సిజన్‌ బంద్‌
పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల ను ఆక్సిజన్‌ సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. తద్వారా మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా పెరిగి విలువైన ప్రాణాలను కాపాడుకోగలమని పేర్కొంది. ఈనెల 22 నుంచి ఇది ఈ నిషేధం అమలులోకి రానుంది. తొమ్మిది రకాల పరిశ్రమలకు దీనినుంచి మినహాయింపునిచ్చారు.

పాజిటివిటీ రేటు 12 రోజుల్లోనే రెట్టింపు
భారత్‌లో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు కేవలం 12 రోజుల్లోనే రెట్టింపయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 8 శాతంగా ఉండేది. 12 రోజుల్లో ఇది 16.69 శాతానికి చేరింది. అంటే ప్రతి 100 కరోనా నిర్ధారణ పరీక్షల్లో 16.69 శాతం పాజిటివ్‌గా తేలుతున్నాయి. వీక్లీ పాజిటివ్‌ రేటు నెల రోజుల్లో 3.05 శాతం నుంచి 13.54 శాతానికి ఎగబాకింది. అత్యధికంగా వీక్లీ పాజిటివ్‌ రేటు చత్తీస్‌గఢ్‌లో 30.38 శాతం, గోవాలో 24.24, మహారాష్ట్రలో 24.17, రాజస్తాన్‌లో 23.33, మధ్యప్రదేశ్‌లో 18.99 శాతంగా ఉంది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 78.56 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే బయటపడ్డాయి. కరోనా వల్ల తాజాగా మరణించిన 1,501 మందిలో మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల వారు ఎక్కువ మంది ఉన్నారు. 9 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్తగా పాజిటివ్‌ కేసులు ఒక్కటీ నమోదు కాలేదు.

92 రోజుల్లో 12,26,22,590 డోసులు
అగ్రరాజ్యం అమెరికాలో 12 కోట్ల కరోనా టీకా డోసులు ఇవ్వడానికి 97 రోజులు పట్టింది. చైనాలో అయితే 108 రోజులు పట్టింది. భారత్‌లో మాత్రం కేవలం 92 రోజుల్లోనే 12 కోట్లకుపైగా టీకాలు డోసులు అర్హులకు ఇవ్వడం గమనార్హం. కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా సాగుతున్న దేశాల జాబితాలో భారత్‌ అగ్రభాగాన నిలుస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్‌ భారత్‌లో ముమ్మరంగా కొనసాగుతోంది.

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 18,15,325 సెషన్లలో 12,26,22,590 టీకా డోసులను అర్హులకు అందజేశారు. మొత్తం డోసుల్లో 59.5 శాతం డోసులను ఎనిమిది రాష్ట్రాల్లోనే ఇవ్వడం విశేషం. నాలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా చొప్పున డోసులను అందజేశారు. గుజరాత్‌లో 1,03,37,448, మహారాష్ట్రలో 1,21,39,453, రాజస్తాన్‌లో 1,06,98,771, ఉత్తరప్రదేశ్‌లో 1,07,12,739 డోసులు ఇచ్చారు. గుజరాత్‌లో ఏప్రిల్‌ 16 నాటికి కోటి డోసుల పంపిణీని పూర్తి చేయగా, మిగతా మూడు రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 14 నాటికి కోటి డోసుల పంపిణీ పూర్తయ్యింది. కరోనా వ్యాక్సినేషన్‌లో 92వ రోజు శనివారం 26,84,956 డోసులు ఇచ్చారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు