హమ్మయ్య.. దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా!

5 Jun, 2021 06:02 IST|Sakshi

గత 5 రోజుల్లో 11.43 లక్షల రికవరీ కేసులు

అదే సమయంలో 6.79 లక్షల పాజిటివ్‌ కేసులు

యాక్టివ్‌ కేసుల్లో 4.78 లక్షల తగ్గుదల

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది. గత నెల 4.14 లక్షల వరకు చేరుకున్న పాజిటివ్‌ కేసులు ఇప్పుడు 1.32 లక్షలకు చేరుకున్నాయి. అదే సమయంలో గత 5 రోజుల్లో దేశంలో 6,79,550 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 11,43,335గా నమోదైంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 24 గంటల్లో 1,32,364 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 2,85,74,350కు చేరింది. మే 7వ తేదీన నమోదైన అత్యధిక కేసులతో పోల్చుకుంటే ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు 68% వరకు తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులో 2,07,071 మంది వైరస్‌ బారి నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 93.08%కి చేరుకుంది.

అదే విధంగా, 2,713 మంది కోవిడ్‌ బాధితులు మరణించడంతో కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,40,702కి పెరిగింది. గత 24 గంటల్లో యాక్టివ్‌ కేసులు 77,420 తగ్గడంతో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 16,35,993కి చేరుకుంది. గత ఐదు రోజుల్లో సుమారు 4 లక్షల క్షీణత నమోదైంది. మే 30న మొత్తం 20.26 లక్షల యాక్టివ్‌ కేసులు నమోదుకాగా ఇవి ఇప్పుడు 16.35 లక్షలకు చేరుకున్నాయి.  ఇందులో రాష్ట్రాల వారిగా చూస్తే కర్ణాటకలో అత్యధికంగా 2,86,819, తమిళనాడులో 2,80,426 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా పరీక్షల్లోనూ పురోగతి కనిపిస్తోంది. గత 24 గంటల్లో 20,75,428 కరోనా టెస్ట్‌లు జరుగగా పాజిటివిటీ రేటు 6.38%గా నమోదైంది. దేశంలోని 377 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5%కంటే తక్కువగా ఉందని కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ ప్ర క్రియ సైతం వేగం పుంజుకుంది. గత 24 గంటల్లో దేశంలో 28,75,286 డోస్‌ల వ్యాక్సిన్‌ వేయడంతో మొత్తం సంఖ్య 22.41కోట్లకు చేరుకుంది.  

వ్యాక్సినేషన్‌లో అమెరికాను మించి..
దేశంలో కనీసం ఒక్క డోసు కోవిడ్‌ టీకా తీసుకున్న వారి సంఖ్య అమెరికా కంటే ఎక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మరింత వేగవంతం చేస్తామని తెలిపింది. దేశంలో కనీసం ఒక్క డోసైనా కోవిడ్‌ టీకా తీసుకున్న వారు 17.2 కోట్లు కాగా, అమెరికా ఇది 16.9కోట్లుగా ఉందని పేర్కొంది. దేశంలోని 60 ఏళ్లు పైబడిన వారిలో 43%మంది, 45 ఏళ్లు పైబడిన వారిలో 37% మంది టీకా వేయించుకున్నట్లు నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ వెల్లడించారు. రానున్న కొద్ది వారాల్లోనే 50% దాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి 10 లక్షల జనాభాలో కోవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య ప్రపంచ సరాసరి 22,181 కాగా, భారత్‌లో అది 20,519గా ఉందని వివరించారు. అదే సమయంలో, ప్రతి 10 లక్షల మంది బాధితుల్లో కోవిడ్‌ మృతులు భారత్‌లో 245మాత్రమే కాగా, ప్రపంచ సరాసరి 477 అని ఆయన పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు